జగన్ కు ప్రివిలేజ్ నోటీసులు.. సభను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపణ

సీఎం జగన్ కు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చింది టిడిపి. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడని మాటలను అన్నట్లుగా చెబుతూ సీఎం జగన్ సభను తప్పుదోవ పట్టించారని ఈ నోటీసుల్లో పేర్కొంది టిడిపి. నిన్న ( డిసెంబర్ 12న ) తెలుగుదేశం పార్టీ అభ్యర్దులు సభకు వచ్చే సమయంలో జరిగిన ఘర్షణపై ఈరోజు ( డిసెంబర్ 13న ) కూడా సభలో వాదోపవాదాలు జరిగాయి. ముఖ్యమంత్రి జగన్ ఈ ఘర్షణపై స్పందిస్తూ ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యలను.. ఆయన వాడిన భాషను తీవ్రంగా తప్పు పట్టారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని కించపరుస్తూ ఏ రకంగా దూషిస్తారని.. దానికి ఏం సమాధానం చెప్తారని  సభలో గట్టిగా నిలదీశారు జగన్. ఇదే సందర్భంలో నిన్న ఘర్షణకు సంబంధించిన వీడియోలు కూడా అధికారి పార్టీ సభ్యులు స్పీకర్ అనుమతితో వాటిని సభలో ప్లే చేశారు. ఈ సందర్భంగా ప్రతి పక్షాలు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరాలని దీనిపై వారు చింతిస్తున్నారనే ప్రకటన చేసినట్లయితే ఈ విషయాన్ని ముగిస్తారని స్పీకర్ స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలలో వాస్తవం లేదు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిని కించపరిచే విధంగా చంద్రబాబు నోటి నుంచి అటువంటి పదాలు రాలేదని సభను పక్కదోవ పట్టించటానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, చేయనటువంటి వ్యాఖ్యలను చేశారని, దీనిపై విచారణ చేయాలి, చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు ప్రివిలైజ్డ్ నోటీసులు ఇచ్చారు. అయితే సభలో ఉన్న ఇతర సభ్యుల దగ్గర నుంచి కూడా అభిప్రాయాన్ని తీసుకుని తదుపరి ఎటువంటి చర్యలకు వెళ్ళాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.