చిల్లర కేసులకిచ్చిన ప్రాధాన్యత వివేక హత్య కేసుకు ఇవ్వడం లేదు

ఏపీలో 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ హత్యపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని వైఎస్ జగన్ సహా పలువురు వైసీపీ నేతలు అప్పుడు డిమాండ్ చేశారు. తీరా ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక మాత్రం సైలెంట్ అయిపోయారు. కాగా, తాజాగా ఈ ఘటనపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య.. జగన్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.

వివేకా హత్యకేసు సీబీఐ దర్యాప్తుకివ్వాలని అడిగింది మీరు కాదా? గవర్నర్‌ని కలిసి మా బాబాయి హత్య కేసును సీబీఐకి ఇవ్వండని కోరింది మీరు కాదా? హైకోర్టులో పిటిషన్ వేసి వివేకా హత్య కేసు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించమని కోరింది మీరు కాదా? అంటూ వర్ల రామయ్య సీఎం జగన్‌ను ప్రశ్నించారు. సీఎం అయిన తర్వాత పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నారు? అని నిలదీశారు.

వివేకా హత్య కేసులో పురోగతి ఏమిటని?, హైకోర్టు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించిన తర్వాత మీ ప్రభుత్వం దర్యాప్తును ఎంతవరకు పరిశీలించింది? అని ప్రశ్నించారు. హైకోర్టు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించి 100 రోజులు దాటింది. ఇంతవరకు సీబీఐ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. సీబీఐ వర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం కేంద్ర హోంమంత్రికి, ప్రధానికి లేఖ రాయాలి. వివేకా కూతురు సునీత కూడా దర్యాప్తు పురోగతి వెల్లడించాలని సీబీఐకి లేఖ రాయాలి. సోషల్ మీడియా లాంటి చిల్లర కేసులకిచ్చిన ప్రాధాన్యత వివేక హత్య కేసుకు ఇవ్వడం లేదని ప్రభుత్వ తీరుపై వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు.