ఎన్టీఆర్ పై చెప్పులు వేయించింది కేసీఆరే

 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌, ప్రజకూటమి నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంటుంది. తాజాగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి ఓ వైపు కేటీఆర్ కి సవాల్ విసురుతూనే.. మరోవైపు కేటీఆర్ మీద, ఇతర టీఆర్‌ఎస్‌ నేతల మీద విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ వారసుడిగా హరీష్ రావును ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించే దమ్ము కేటీఆర్‌కు ఉందా? అని సవాల్‌ చేశారు. ఒకవేళ కేటీఆర్‌ ప్రకటిస్తే ఇంతకు ముందు తాను హరీష్ రావు విషయంలో చేసిన వ్యాఖ్యలను బేషరతుగా విరమించుకుంటానని ప్రకటించారు.

చంద్రబాబును వెన్నుపోటు దారుడు అనడాన్ని ఖండించారు. ఇది కేటీఆర్‌ దిగజారుడు తనానికి నిదర్శనంగా పేర్కొన్నారు. కేటీఆర్‌ను పిల్లకాకిగా అభివర్ణించారు. చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. 1200మంది అమాయకుల బలిదానంవల్ల వచ్చిన తెలంగాణను కేసీఆర్‌ కుటుంబంలోని నలుగురే అనుభవిస్తున్నారన్నారు. నాలుగు కోట్ల ప్రజలను వెన్నుపోటు పొడిచింది ఈ నలుగురేనన్నారు. చంద్రబాబును కార్నర్‌ చేసి లబ్దిపొందాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని  హెచ్చరించారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు తమ వైఖరిని మార్చుకోకపోతే ప్రజలే వారిని రాజకీయంగా సమాధి చేస్తారన్నారు.

1995లో డీసీసీబీ ఎన్నికలకు సంబంధించి వరంగల్‌, ఆదిలాబాద్‌, నల్లగొండ, మెదక్‌ జిల్లాల్లో కేసీఆర్‌, నగేశ్‌, కడియం శ్రీహరి, దయాకర్‌రావు, మాధవరెడ్డి అన్నగారి ఆదేశాలకు వ్యతిరేకంగా పని చేశారన్నారు. వీరంతా ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ తమను సస్పెండ్‌ చేయకుండా చూడాలని చంద్రబాబును వైస్రాయి హోటల్‌కు తీసుకువెళ్లారని, బాబు తన వంతు ప్రయత్నం చేస్తుండగానే ఎన్టీఆర్ పై చెప్పులు వేయించింది కేసీఆరేనని అన్నారు. చరిత్రను వక్రీకరిస్తే చరిత్ర హీనులవుతారని ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు.