వెన్నుపోటు పొడవద్దంటూ నాయకులపై మండిపడ్డ దేవినేని ఉమా...

 

ఒక చోట ఎదిగి పక్క వాళ్ళను పొగిడితే ఎవ్వరికైనా కోపం రావడం సహజం .తెలుగుదేశం పార్టీలో ఎదిగి పక్క పార్టీలోకి వెళ్ళిన వారికి.. చంద్రబాబును విమర్శించే హక్కు లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీ పార్టీ గురించి చెప్పుకోండి గాని ఇక మా పార్టీ గురించి మీకెందుకని బీజేపీ లోకి వెళ్లిన నేతలను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. టిడిపి నుంచి ఎందరో ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా, నాయకుల్ని తయారు చేసుకోగలమన్నారు దేవినేని ఉమ. ఇవాళ పార్టీ నుంచి రాజ్య సభ సభ్యులు వెళ్లిపోయారు, గతంలో శాసన సభ్యులు ఎంపీలు వెళ్లిపోయారు. ఎంతోమంది వెళ్లిపోయినా కూడా తెలుగుదేశం పార్టీ చెక్కుచెదరలేదు. ఎంతోమందిని తయారు చేసే పరిశ్రమ లాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని దేవినేని ఉమా పేర్కొన్నారు.

ఇవాళ మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చంద్రబాబునాయుడు గారిని విమర్శించే నైతిక హక్కు లేదని, నైతిక అర్హత లేదని దేవినేని తెలిపారు. మీ పార్టీ సిద్దాంతాలు చెప్పుకోండి, మీ ప్రయోజనాల్ని చెప్పుకోండి, లేకపోతే మీ గురించి చెప్పుకోండి అంతే తప్పా పార్టీ ద్వారా ఉన్నతమైన స్థానాలు పొంది, పార్టీ ద్వారా పైకొచ్చి, ఇవాళ పక్క పార్టీల్లోకో, వేరే పార్టీల్లోకో ఎక్కడికో వెళ్ళీ మా పార్టీని ప్రశ్నించిన, మా పార్టీ నాయకుడిని దెబ్బతియాలని ప్రయత్నం చేసినా, ప్రతిష్టకు భంగం కలిగే విధంగా మాట్లాడినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సహించరూ అని దేవినేని ఉమా మండిపడ్డారు.