చిత్తూరు జిల్లా టీడీపీ రాజకీయం.. ఓడిపోయాక బిజినెస్ చేసుకుంటున్న అమరనాథరెడ్డి

 

నూతనకాల్వ అమరనాథరెడ్డి చిత్తూరు జిల్లా టీడీపీ రాజకీయాల్లో కీలకమైన నేత. జిల్లా నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన అమరనాథరెడ్డి ఇప్పుడు అధికారానికి దూరం కావడంతో రాజకీయంగా కంటే వ్యాపారపరంగానే బిజీ అయ్యారు. ఇదే ఇప్పుడు జిల్లా పార్టీ కేడర్ లో చర్చగా మారింది. 1996 లో అమరనాథరెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి చిత్తూరు ఎంపీగా గెలవడంతో.. పుంగనూరు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అమరనాథ్ రెడ్డి 36,046 ఓట్ల ఆధిక్యంతో గెలిచి పొలిటికల్ ఎంట్రీ చేశారు. ఆ తర్వాత నియోజక వర్గం పునర్విభజనతో 2009 లో పలమనేరు అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా మరోసారి గెలిచారు. రాష్ట్ర విభజన సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు వైఖరిని తప్పుపడుతూ ఆ పార్టీకి దూరమైన అమరనాథరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 లో జరిగిన ఎన్నికల్లో పలమనేరు నుంచి మళ్లీ గెలిచిన ఆయన ఆ తర్వాత టీడీపీలోకి జంప్ అయ్యి, మంత్రిగా పని చేశారు. అయితే మొన్నటి ఎన్నికల్లో షాక్ కొట్టడంతో ఎమ్మెల్యే పదవికి కూడా దూరమయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి అమరనాథరెడ్డి పూర్తిగా సైలెంటయ్యారు. కొంతకాలం రాజకీయం కంటే వ్యాపారమే మేలని భావిస్తున్నారు. 

ఓటమి ఎరుగని తండ్రి నూతనకాల్వ రామకృష్ణారెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన అమరనాథరెడ్డి రాష్ట్రంలో టీడీపీ ఓటమిని.. పలమనేరులో తన ఓటమిని.. జీర్ణించుకోలేకపోతున్నారు. మే 23 న ఓట్ల లెక్కింపు తర్వాత అమరనాథరెడ్డి జిల్లాలో కనిపించడం లేదు. కొన్ని రోజులు విదేశాల్లో గడిపారు. ఆ తర్వాత అప్పుడప్పుడు పలమనేరులో కేడర్ ను కలుస్తూనే ఎక్కువ సమయం బెంగళూరుల్లో వ్యాపారంపైనే అమర్ దృష్టిపెట్టారు. చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మాత్రమే హడావుడి చేసి ఆ తర్వాత జిల్లాకు రావడం లేదనే టాక్ నడుస్తుంది. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో వ్యాపార సంబంధాలు కూడా ఉండడంతో అమరనాథరెడ్డి సైలెంటయ్యారు అనేది ఓ వార్త. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయం కంటే వ్యాపారమే బెటర్ అని అమర్ భావించి వుంటారన్న చర్చ కూడా ఉంది. త్వరలోనే స్థానిక సంస్ధల ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉండటంతో అమర్ మౌనం వీడి దూకుడు ప్రదర్శిస్తారని జిల్లా పార్టీ యంత్రాంగం భావిస్తుంది. జిల్లా టీడీపీలో మాస్ లీడర్ గా గుర్తింపు ఉన్న అమర్ మౌనం వీడి దూకుడు ప్రదర్శించారని కేడర్ కూడా కోరుకుంటోంది.