దమ్ముంటే పట్టిసీమ వాడకం ఆపేయండి!!

 

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమయింది. తీర్మానాన్ని వైసీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రవేశ పెట్టారు. విప్ బూడి ముత్యాలనాయుడు బలపరిచారు. ఇద్దరూ తమ ప్రసంగంలో.. టీడీపీ పాలనపై అనేక విమర్శలు చేశారు. ఆ తర్వాత టీడీపీ తరపున అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆ సమయంలో పోలవరం ప్రాజెక్ట్‌పై అచ్చెన్నాయుడు వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యేలన్నట్లుగా సాగింది. 

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అంచనాలు పెంచి.. టీడీపీ సర్కార్ దోపిడీకి పాల్పడిందని కాంట్రాక్టర్లకు మేలు చేశారని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ విమర్శలపై అచ్చెన్నాయుడు సూటిగా స్పందించారు. అంచనాలు తగ్గించి.. ప్రాజెక్టును పూర్తి చేయాలని సవాల్ చేశారు. అంచనాలు తగ్గించి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే సన్మానం చేస్తామని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలు తీసుకుని చంద్రబాబు తప్పు చేశారన్న వైసీపీ నేతలకూ అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. అడిగారో, ఇచ్చారో ప్రభుత్వం దగ్గర రికార్డులుంటాయన్నారు.

పట్టిసీమపైనా వైసీపీ సభ్యులు ఆరోపణలు చేశారు. అవినీతి జరిగిందన్నారు. ఆ ప్రాజెక్ట్ పై పెట్టినంత దృష్టి పోలవరంపై పెడితే.. ఈ పాటికే ప్రారంభమయ్యేదని వైసీపీ నేతలు విమర్శలు చేశారు. దీనిపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. పట్టిసీమ వల్ల ఉపయోగం లేదనుకుంటే అ ప్రాజెక్ట్ ను ఉపయోగించడం మానేయాలని సవాల్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ను సీఎం.. కేంద్రానికి వదిలేయాలని నిర్ణయించుకుని.. ఏపీకి తిరిగి వచ్చిన తర్వాత మనసు మార్చుకున్నారని గుర్తు చేశారు.