పసుపు ప్రభంజనం.. టీడీపీ జోష్.. వైసీపీ షేక్..

ఇసుకేస్తే రాలనంత జనం. నేల ఈనిందా అనేంతగా జన ప్రవాహం. అవేమీ అలనాటి ఎన్టీఆర్ సభలు కావు. తిరుపతి ఉప ఎన్నికల్లో నేటి చంద్రబాబు సునామీలు. బాబు వచ్చారు.. జనం కదలివచ్చారు. ఇంతింతై.. జన సంద్రమంతై.. చంద్రబాబు రోడ్ షోలన్నీ కిక్కిరిసిపోయాయి. తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గంలో ఏ మూలకెళ్లినా.. ఏ ప్రాంతానికెళ్లినా.. జనమే జనం. అంతా పసుపు మయం. ఎటు చూసినా చంద్రన్న ప్రభంజనం. 

ముందుగా లోకేశ్‌బాబు ప్రచారంతో టీడీపీకి ఫుల్ మైలేజ్ వచ్చింది. ఇక చంద్రబాబు ఎంట్రీతో ఆ జోష్ మరో రేంజ్‌కు చేరింది. ముందు చంద్రన్న.. ఆ వెనకాలే పసుపు దండు. బండెనక బండి కట్టి.. జెండా వెనుక జెండా పట్టి. తిరుపతి పార్లమెంట్ పరిధిలో పది రోజులుగా పసుపు పండుగ. జై తెలుగుదేశం.. జై చంద్రన్న నినాదాలతో తిరుపతి మారు మోగిపోయింది. చంద్రబాబు ఎక్కడ పర్యటించినా ఆయనకు అడుగడుగునా ఘనమైన స్వాగతమే. అధినేత ఎక్కడ రోడ్ షో నిర్వహించినా.. మరెక్కడ సభ పెట్టినా.. జన సందోహమే. పసుపు కోలాహలమే. గతంలో ఎక్కడైతే సభలు డల్‌గా కనిపించాయో.. ఇప్పుడు అదే చోట చంద్రబాబు రోడ్ షోలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అదే సమయంలో వైసీపీ సభలు జనం లేక వెలవెలబోయాయి. అధికార పార్టీ నిర్వహించిన సభలు, రోడ్ షోలు అట్టర్ ఫ్లాప్ అవడం తిరుపతి వాసులు కళ్లారా చూశారు. 

చంద్రబాబు ప్రచారంతో ప్రధాన కూడళ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. మైదానాలు మెగా సభలతో మైమరిపించాయి. ఇంటింటి ప్రచారంతో, పాదయాత్రలతో హోరెత్తించారు. తిరుపతి వాసులను తన ప్రచారంతో మెప్పించి మెస్మరైజ్ చేశారు చంద్రబాబు. పగలు, రాత్రి ప్రచారం చేస్తూ.. జగన్ ప్రభుత్వ అన్యాయాలు, అరాచకాలపై విరుచుకుపడుతూ.. జనాలకు కనువిప్పు కలిగించారు చంద్రబాబు. ఆయన ప్రసంగంలో వాడి, వేడి పెరిగింది. మునపటిలా సుత్తి లేకుండా సూటిగా మాట్లాడారు. ఓటర్లను ఆలోచింపజేసేలా.. నేరుగా వారి గుండెలను తాకేలా ఆయన వాగ్ధాటి కొనసాగింది. 

"కరోనా వైరస్ కన్నా జగన్ వైరస్ అత్యంత ప్రమాదకరం. ఎమ్మెల్యేలు రిటైల్‌గా.. సీఎం జగన్ హోల్‌సేల్‌గా సహజ వనరులు దోచేస్తున్నారు. వాళ్లు నాయకులా? మాఫియా గ్యాంగ్‌లా? జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చి ప్రజలు మోసపోయారు. జగన్‌కు ఇదే చివరి అవకాశం కావాలి. తిరుపతి ఎన్నికల్లో మీరు వేసే ఓటుతో జగన్‌కు కనువిప్పు కావాలి. లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఫ్యాన్‌ను తుక్కు తుక్కుగా విరగొట్టాలి." ఇలా చంద్రబాబు తన ప్రసంగాలతో వైసీపీపై, సీఎం జగన్‌పై ఉప్పెనగా విరుచుకుపడ్డారు. ఓటర్లలో ఉత్సాహం, ఉద్రేకం కలిగించారు. 

తిరుపతి ఎన్నికల నగారా మోగినప్పుడు అంతా టీడీపీని లైట్ తీసుకున్నారు. పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించాక, ముందుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రంగంలోకి దిగారు. ఆ యువనేత ఉప్పెనలా తిరుపతిని ముంచెత్తాడు. చుట్టూ జనం. జనం మధ్యలో లోకేశ్. తిరుపతిలో అడుగడుగునా నారా వారి నినాదం. ప్రజలతో ఇట్టే మమేకమయ్యారు లోకేశ్. యువతతో సెల్ఫీలు దిగారు. టీ షాపులో టీ తాగారు. వృద్ధులను పరామర్శించారు. మహిళల కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. పేదల కన్నీళ్లు తుడిచారు. నారా లోకేశ్ ప్రచారంతో టీడీపీ శ్రేణుల్లో వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. ఆ ఉత్సాహాన్ని మరింత ఉధృత స్థాయికి తీసుకెళ్లారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. 

చంద్రబాబు సునామీలాంటి ప్రచారంతో తిరుపతి ఉప ఎన్నికల్లో విజయంపై టీడీపీ ధీమాగా కనిపిస్తోంది. ఓటర్ల ఆలోచనలో స్పష్టమైన మార్పు వచ్చింది. ఆ మార్పు ప్రీ పోల్ సర్వేల్లో స్పష్టమవుతోంది. ఒకప్పుడు వైసీపీ మెజార్టీపై పందేలు కాసిన వారంతా, ఇప్పుడు టీడీపీ గెలుపుపై బెట్టింగ్‌లు పెంచేశారు. ఈ మార్పుతో అధికార వైసీపీలో కలవరపాటు. మరోవైపు, ఫ్యాను పార్టీలో అంతర్గత కుమ్ములాటలు.. గురుమూర్తిలాంటి బలహీన అభ్యర్థి.. ఆ పార్టీకి పెద్ద మైనస్‌గా మారింది. జగన్ విధించిన 5 లక్షల మెజార్టీ మాటేమో కానీ, గెలిస్తే అదే చాలు అన్నరీతిలో స్థానిక వైసీపీ నేతల్లో కంగారు మొదలైంది. 

చంద్రబాబు, లోకేశ్‌బాబులు తిరుపతి గెలుపోటములను అమాంతం మార్చేశారని అంటున్నారు. అప్పటి దాకా ఓ లెక్క.. వారిద్దరూ వచ్చాక మరో లెక్కగా మారింది పరిస్థితి. నారా లోకేశ్ ముందస్తుగా జనాలను సంసిద్ధం చేస్తే.. చంద్రబాబు ఎంట్రీతో తిరుపతి ఎలక్షన్ సినారియో పూర్తిగా మారిపోయింది. మరి కొన్ని గంటల్లో పోలింగ్ జరగనుండగా.. వైసీపీలో నిరుత్సాహం.. టీడీపీలో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. గెలుపుపై తెలుగు తమ్ముళ్లు ధీమాగా ఉన్నారు. జై తెలుగుదేశం.. జై చంద్రన్న.. అంటూ ఓట్ల పండగకు సన్నద్దమవుతున్నారు తిరుపతి ఎంపీ నియోజకవర్గ ఓటర్లు.