జోరందుకున్న సైకిల్ స్పీడు

 

 

 

తెలుగుదేశం పార్టీలోకి భారీ స్థాయిలో నాయకులు వలస వెళ్తున్నారు. సీమాంధ్రలో సైకిల్ స్పీడు పెరిగింది. వివిధ పార్టీల నుంచి చేరికల జోరు ఊపందుకుంది. సోమవారం ఒక్కరోజే కాంగ్రెస్, జగన్ పార్టీలకు చెందిన సుమారు 20 మందికి పైగా నేతలు పచ్చ కండువాలు కప్పించుకున్నారు.


చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కుతూహలమ్మ, అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తిప్పేస్వామి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తదితరులు టీడీపీలో చేరారు. పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎంఆర్‌సీ రెడ్డి (తిరుపతి), చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి జి. శంకర్ యాదవ్, తిరుపతి నియోజకవర్గానికి చెందిన హరిప్రసాద్, నరసాపురం కాంగ్రెస్ నేతలు పొత్తూరు రామాంజనేయరాజు, అన్నా రామచంద్రయ్య, హరికుమార్ టీడీపీ గూటికి చేరారు. అనంతపురం జిల్లాకు చెందిన వి.రామ్మూర్తి, మాజీ ఎంపీ డి. పుల్లయ్య కుమారుడు దరూరి రమేశ్ చేరారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తేళ్ల సుబ్బారావు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.


పెద్దాపురం నుంచి దావూలూరి దొరబాబు, అమలాపురం నుంచి ఎస్. నాగేశ్వరరావు, హనుమాన్ జంక్షన్‌కు చెందిన వీరమాచినేని సత్యప్రసాద్, ఎనికపాడుకు చెందిన గోగం బాలకోటేశ్వరరావు కూడా దేశంలో చేరారు. తులసీ గ్రూప్ సంస్థల అధినేత తులసీ రామచంద్ర ప్రభు టీడీపీలో చేరేందుకు నిశ్చయించుకున్నారు. సోమవారం రాత్రి ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయనను గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈయన గత ఎన్నికల్లో పీఆర్పీ తరఫున పోటీచేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, ఆయన మేనల్లుడు, కురుపాం ఎమ్మెల్యే జనార్దన థాట్రాజ్ , నోవా విద్యాసంస్థల అధినేత, కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్తం శెట్టి కృష్ణారావు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.