చంద్రబాబు అరెస్ట్.. నన్ను ఎన్ కౌంటర్ చేయండి అంటూ బాబు ఫైర్!!

విశాఖపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తోన్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైసీపీ కార్యకర్తల అడ్డుకోవడంతో చంద్రబాబు కాన్వాయ్ ముందుకు కదిలే పరిస్థితి కనపడలేదు. దాదాపు రెండు గంటల పాటు బాబు కాన్వాయిలోనే ఉండిపోయారు. వేలాదిగా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు విమానాశ్రయ ప్రాంతానికి రావడంతో.. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు వాహనంపై కోడిగుడ్లు, టమోటాలు, చెప్పులు విసిరారు. కొందరు చెప్పులు చూపెడుతూ 'గో బ్యాక్ బాబు' అంటూ నినాదాలు చేశారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు 'ఏ1- ఏ1' అంటూ నినాదాలు చేశారు. ఇలా ఇరు పార్టీల కార్యకర్తల నినాదాలు, తోపులాటలతో విశాఖ విమాశ్రయ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.

తీవ్ర ఉద్రిక్తతల మధ్య చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 151 సెక్షన్ కింద చంద్రబాబును అదుపులోకి తీసుకుని విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లోకి తరలించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు ఆయన్ను నిర్బంధింలోనే ఉంచాలని పోలీసులు భావిస్తున్నారు. ఆయనతో పాటు ఉన్న టీడీపీ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పర్మిషన్ ఉన్నా అడ్డుకుంటారా అంటూ ఫైర్ అయిన ఆయన.. నన్ను షూట్ చేయండి.. నన్ను ఎన్ కౌంటర్ చేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.