విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ, టీడీపీ పరస్పర దాడులు.. ఎట్టకేలకు విజయనగరం టూర్ కు చంద్రబాబు

విజయనగరం జిల్లా ప్రజాచైతన్య యాత్రకు వెళ్లేందుకు ఇవాళ ఉదయం విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకున్న సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్దితులు తలెత్తాయి. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబును అడ్డుకోవాలని నిన్న మంత్రి అవంతి శ్రీనివాస్ ఇచ్చిన పిలుపుతో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. విశాఖ ఎయిర్ పోర్టులోనే చంద్రబాబును అడ్డుకున్నారు. కోడిగుడ్లు, టమోటాలు, చెప్పులను చంద్రబాబు కాన్వాయ్ పైకి విసిరారు. చంద్రబాబును కాపాడే క్రమంలో టీడీపీ కార్యకర్తలు కూడా ఎదురుదాడులకు దిగడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారిందీ. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారు శాంతించలేదు.

వైసీపీ కార్యకర్తల దాడుల మధ్య దాదాపు మూడు గంటల పాటు చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టులోనే చిక్కుకుపోయారు. చంద్రబాబు కాన్వాయ్ ముందుకు కదలకుండా వైసీపీ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుతగిలారు. వీరితో టీడీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో పరిస్ధితి అంతకంతకూ ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకున్నా ఫలితం లేకపోయింది. చంద్రబాబు గో బ్యాక్ నినాదాలతో వైసీపీ కార్యకర్తలు హంగామా చేశారు. ఓ దశలో పోలీసులు శాంతి భద్రతల పరిస్ధితిని కారణంగా చూపుతూ చంద్రబాబును వెనక్కి పంపించేందుకు సిద్దమయ్యారు. చివరికి అతి కష్టం మీద చంద్రబాబు బయటపడ్డారు. చివరికి మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత విజయనగరం టూర్ కు వెళ్లేందుకు పోలీసులు చంద్రబాబును అనుమతించారు.

మరోవైపు చంద్రబాబును విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న ఘటనపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్ర మాటల యుద్దం సాగుతోంది. చంద్రబాబును అడ్డుకునేందుకు ఇవాళ గుడ్లు, టమోటాలు విసిరారని, రేపు బాంబులు, కత్తులు విసురుతారని వైసీపీ నేతలను ఉద్దేశించి టీడీపీ యువనేత లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్ విశాఖలో అడుగుపెడితే ఏ రేంజ్ అరాచకం ఉంటుందో వైసీపీ ఇవాళ ట్రైలర్ చూపించిందని లోకేష్ మండిపడ్డారు. మూడు ముక్కలాట ఆడి సగం చచ్చారని, ప్రతిపక్ష నేతను విశాఖలో అడ్డుకునేందుకు గొయ్యి తవ్వి పూర్తిగా చచ్చారని లోకేష్ ట్వీట్ కూడా చేశారు.

మరోవైపు తనను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి అందరి భరతం పడతానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్జి స్పందించారు. “కొండపై నుంచి జారిపడుతూ మధ్యలో కొమ్మను పట్టుకుని వేలాడుతున్న పరిస్థితి చంద్రబాబుది. ఏ క్షణంలోనైనా కొమ్మ విరగొచ్చు లేదా పట్టుతప్పి తనే అగాథంలోకి పడిపోవచ్చు. అంత నిస్సహాయతలో కూడా ‘ఒక్కొక్కరి భరతం పడతా, ఎవర్నీ వదిలి పెట్టేది లేదు’ అని బెదిరిస్తున్నాడంటే మామూలు ‘గుండె’ కాదు” అని సాయిరెడ్డి ట్వీట్ చేశారు.