ప్రెస్ రిలీజుల్లో మాత్రమే నిప్పులు చెరిగే యనమలపై టీడీపీ లో చర్చ!

* క్వారంటైన్ ను ఎప్పటి నుంచో జీవన విధానంగా మలుచుకున్న యనమల కన్నా, వర్ల రామయ్య, బుద్ధా వెంకన్నలే బెటరని నేతల్లో అభిప్రాయం 
* చంద్రబాబు నాయుడు 24X 7 ప్రజా క్షేత్రంలో ఉన్నా, యనమల మాత్రం పత్రికా ప్రకటనలకే  పరిమితం కావటం పై ఆక్షేపణ 

ఎసెట్స్, లయబిలిటీస్ అని మనం చదువుకుంటూ ఉంటాం. ఆంధ్ర ప్రదేశ్ లో, ఆ మాట కొస్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ కి లయబిలిటీ గా మారిన చాలామంది నేతల్లో మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఒకరు అనే భావన చాల మంది నాయకుల్లో బలంగా ఉంది.  పలుకే బంగారమాయెరా పద్ధతిలో ఆయన తనను తాను  ప్రెస్ నోట్స్ కు మాత్రమే పరిమితం చేసుకుని, సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోవటం ఆయన ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పటి నించీ చూస్తూనే ఉన్నాం. అయితే ఆయన చాలా సీనియర్ మోస్ట్ కావటం వల్లనూ, పార్టీ లో ఆయనకు చంద్రబాబు నాయుడు అత్యంత ప్రయారిటీ ఇవ్వటం కారణం గానూ, ఎన్ఠీఆర్ ను పదవీచ్యుతుని చేసిన సమయం లో ఆయన అద్భుతమైన 'శ్రమదానం' చేసినందువల్లనూ --ఇప్పటికీ తెలుగు దేశం నాయకులు ఆయన్ను అరమోడ్పు కన్నులతో, ఆరాధ్య పూరిత దృక్కులతో చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. అలా, తనదైన శైలిలో- పార్టీ లో 'సరిలేరు నాకెవ్వరు' టైటిల్ పెట్టుకుని మహరాజులా వెలిగిపోతున్న యనమల రామకృష్ణుడు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మీద ప్రెస్ రిలీజ్ లో చెడా మడా నిప్పులు చెరిగేశారు. అలా చెరిగిన నిప్పులలో-కొన్ని నిప్పురవ్వలను మీ కోసం ప్రత్యేకంగా అందచేస్తున్నాం. 

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో వైసిపి ప్రభుత్వ వైఫల్యం మీద ఆగ్రహం వ్యక్తం చేసిన యనమల, ఉపశమన చర్యలు శరవేగంగా చేపట్టాలని, ఒక ప్రకటనలో  డిమాండ్ చేశారు. "విపత్తుల్లో ప్రజలను కాపాడేవాడే పాలకుడు. ఆపదల్లో అండగా ఉండటం నాయకత్వ లక్షణం. అలాంటిది ప్రజలను కష్టాల్లో వదిలేయడం రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే. 
రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉధృతం. పాలకుల ఉదాసీనత వల్లే  రాష్ట్రంలో కరోనా విస్తృతం.
వైద్య ఆరోగ్యశాఖకు కేటాయించిన రూ 11,399కోట్లలో ఎంత ఖర్చు పెట్టారు..? రూ 11,399కోట్ల బడ్జెట్ పెట్టి, కరోనా మాస్క్ లకు రూ 30కోట్లే ఇస్తారా," అంటూ ఆవేశంగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ను నిలదీశారు. 

ఇదేనా మీరు చెప్పిన ‘‘నాడు-నేడు’’..? నాడు సీఎంగా చంద్రబాబు ఇలాగే చేశారా..? నేడు సీఎంగా మీరెలా చేస్తున్నారో ప్రజలే చూస్తున్నారంటూ కూడా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ను కడిగి పారేశారు. విపత్తుల్లో చంద్రబాబు పనితీరుకు, మీ పనితీరుకు ప్రజలే బేరీజు వేస్తున్నారంటూ కూడా హెచ్చరించారు. " టిడిపి ప్రభుత్వం మెడ్ టెక్ జోన్ పెట్టకపోతే ఇప్పుడు పరిస్థితి ఏమిటి..? డాక్లర్లు, వైద్య సిబ్బందికి రక్షణ ఉపకరణాలు ఉండేవేనా..? మెడ్ టెక్ జోన్ పై చేసిన ఆరోపణలపై ప్రజలకు క్షమాపణ చెప్పాలి.

గత ఏడాది రూ 2,27,975కోట్ల బడ్జెట్ లో ఎంత ఖర్చు పెట్టారు. తొలి 6నెలల్లో 35%కూడా ఖర్చు చేయలేదు. రెవిన్యూ వ్యయమే తప్ప కేపిటల్ వ్యయం శూన్యం. 65% నిధులు మీవద్దే ఉంటే ఉద్యోగుల జీతాల్లో కోతలు ఎందుకు," అంటూ యనమల ఆ పత్రికాప్రకటనలోనే ఆగ్రహం తో ఊగిపోయారు.  కరోనా నిరోధానికి నిధులు ఎందుకివ్వరు..? డాక్టర్లు, సిబ్బందికి మాస్క్ లు, రక్షణ ఉపకరణాలు ఎందుకు కొనరు..?పోలవరం సహా అన్ని ప్రాజెక్టుల పనులు నిలిపేశారు. అమరావతి సహా అభివృద్ది పనులన్నీ నిలిపేశారు. 

విపత్తు నిర్వహణకు, నరేగా కు, 14వ ఆర్ధిక సంఘ నిధులు, డివల్యూషన్ నిధులు, కేంద్రం ఇచ్చిన నిధులన్నీ ఏం చేశారు..?
11నెలల్లో అభివృద్ది శూన్యం, పేదల సంక్షేమం నిల్.. కరోనా ఉపశమన చర్యలు కూడా మొక్కుబడిగానే..
డిసెంబర్ లోనే విదేశాల్లో కరోనా ప్రభావం ప్రారంభం. జనవరి 3వ వారంలో మనదేశంపై కరోనా ప్రభావం. నాలుగో క్వార్టర్ పై కరోనా ప్రభావం చూపింది. మరి మొదటి 3క్వార్టర్లలో మీరు చేసిన అభివృద్ది, సంక్షేమం ఏమిటి..? కరోనా రాకముందు ఏం చేయలేదు, కరోనా వచ్చాక చేసిందేమీ లేదని కూడా జగన్ మోహన్ రెడ్డి లెక్క తేల్చేశారు. 

కరోనాపై కేంద్ర మార్గదర్శకాలు గాలికొదిలేశారు. లాక్ డౌన్ కు వైసిపి నేతలే తూట్లు పొడుస్తున్నారు. కరోనా వ్యాప్తి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సాహమా..? ఈ విపత్తులోనూ ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తారా..?కరోనాలోనూ మీ అవినీతి,అక్రమాలు మానుకోరా, అంటూ నిప్పులు చెరిగారు. లోడింగ్ కార్మికులకు కరోనా సోకితే బాధ్యత ఎవరిది..? లాక్ డౌన్ పీరియడ్ లో వందల లారీల్లో ఇసుక తరలింపులా..? ట్రాక్టర్లలో గ్రావెల్, మట్టి తరలిస్తుంటే ఏం చేస్తున్నారు..? మద్యం అక్రమ విక్రయాలను ప్రోత్సహిస్తారా, అని కూడా తన ప్రెస్ రిలీజ్ లో ఆయన ప్రశ్నించారు. 

ఏడాది గడుస్తున్నా పరిపాలనపై సీఎంకు అవగాహన లేదు. సంబంధిత శాఖలపై ఏ ఒక్కమంత్రికి పట్టు దొరకలేదు. స్వప్రయోజనాలే తప్ప ప్రజారోగ్యంపై వైసిపి నేతలకు శ్రద్ద లేదు. టిడిపి హయాంలో ఏ అభివృద్ది పని ఆగలేదు. ఏ సంక్షేమ పథకం రద్దు చేయలేదు. పైగా అనేక కొత్త సంక్షేమ పథకాలు ప్రారంభించాం. అనేక అభివృద్ది ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశాం. విపత్తుల్లో బాధిత ప్రజానీకాన్ని ఆదుకున్నాం. హుద్ హుద్ లో, తిత్లి తుపాన్ లో ఎలా ఆదుకున్నామో ప్రజలకు తెలుసునని కూడా యనమల గుర్తు చేశారు. 

విపత్తులంటే సీఎం జగన్ కు భయం. ఎప్పుడు విపత్తులు వచ్చినా పత్తా ఉండరు. తిత్లి తుపాన్ లో, మొన్న గోదావరి, కృష్ణా వరదల్లో ఎక్కడ ఉన్నారో ప్రజలు మరిచిపోలేదు. పాలకుల నిర్లక్ష్యం  ప్రజలకు శాపం కారాదు. ఇప్పటికైనా కరోనా కట్టడి చర్యలు ముమ్మరం చేయాలి. ఫ్రంట్ లైన్ వారియర్లకు రక్షణ ఉపకరణాలు అందజేయాలి. వైద్య ఆరోగ్య శాఖకు నిధులు విడుదల చేయాలి. రైతుల వద్ద పంట ఉత్పత్తులు వెంటనే కొనుగోలు చేయాలి. ప్రతి పేద కుటుంబానికి రూ 5వేలు ఆర్ధిక సాయం అందించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇలా ఆయన ప్రెస్ రిలీజ్ సాంతం ఆయన జగన్ మోహన్ రెడ్డి ని కడిగేసి, నిప్పులు చెరిగి చంద్రబాబు నాయకత్వం పట్ల తన విధేయతను ను ఎప్పటిలాగానే-కాగితం రూపేణా తీర్చుకున్నారు. "జగన్ మోహన్ రెడ్డి ఈ ఎనిమిది నెలల నుంచే క్వారంటైన్ లో ఉన్నారు. మా యనమల వారు రాజ్యం చేసినంత కాలం ఎక్కువ సమయం క్వారంటైన్ లో గడిపిన సన్నివేశాలను, సందర్భాలను ఇప్పుడో సరి మేము గుర్తు చేసుకుంటున్నాం, ఎలాగూ కరోనా కారణంగా కాస్తంత వీలు చిక్కింది," అంటూ టీ డీ పీ నాయకులు నిట్టూరుస్తున్నారు.