కమలం - సైకిల్ పొత్తు పొడిచేనా?

 

తెలుగుదేశం పార్టీ, బీజేపీల పొత్తు పరిస్థితి అయోమయంలో పడింది. సాక్షాత్తు బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ దూతగా వచ్చిన ప్రకాష్ జవదేకర్ కూడా ఇక్కడి పొత్తుల విషయాన్ని ఏమీ తేల్చలేక చేతులెత్తేసి హస్తిన వెళ్లిపోయారు. జైట్లీయే స్వయంగా రంగప్రవేశం చేస్తారని ప్రచారం జరిగినా ఆయన కూడా ఇంతవరకు రాలేదు. ‘చంద్రబాబు వల్లే అధికారం కోల్పోయాం. పొత్తు వ్యవహారం కుదరకపోతే అన్ని స్థానాలకు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. పొత్తుల కోసం మేమెవ్వరినీ బతిమాలడం లేదు’ అని బీజేపీ తెలంగాణా శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం చూస్తే, ఇక పొత్తు పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. రెండు ప్రాంతాల్లో కలిపి ఎనిమిది వరకూ ఎంపీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ సరేనంటోంది. ఇందులో తెలంగాణాలో హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, మహబూబ్‌ నగర్, మెదక్, సీమాంధ్రలో నరసాపురం, తిరుపతి ఉన్నట్లు సమాచారం. దీనిపై కమలనాథులు మండిపడుతున్నారు.

 

హైదరాబాద్ స్థానం మజ్లిస్ కంచుకోట. అలాగే మెదక్ నుంచి ఈసారి కేసీఆర్ పోటీ చేయచ్చు. ఇలా, కచ్చితంగా ఓడిపోతారనుకునే స్థానాలను తమకిచ్చి ‘గాలికి పోయే పేలాల పిండి కృష్ణార్పణం’ అన్నట్లుగా వ్యవహరిస్తే పొత్తులపై ముందుకు ఎలా వెళ్తామని అంటున్నారు. కానీ.. తాము తమ సీట్ల జాబితాను ఊరికే ఆషామాషీగా ఇవ్వలేదని, ఏ సీటును బీజేపీ తీసుకుంటే లాభం ఎలా ఉంటుంది? అక్కడ రాజకీయ సమీకరణాలు, స్థానిక బలాబలాలు వివరిస్తూ శాస్త్రీయంగా ఇచ్చామని టీడీపీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారట.

 

ఇదంతా చూసి.. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందన్న అంచనాతో బీజేపీలో చేరిన సీమాంధ్ర నేతల గుండెల్లో ఇప్పుడు రైళ్ళు పరిగెడుతున్నాయి. సీమాంధ్రలో బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. అక్కడ టీడీపీతో పొత్తు ఉంటేనే ఆ పార్టీ అభ్యర్థులు గెలిచే పరిస్థితి ఉంది. టీడీపీలో పోటీ అధికంగా ఉండటం వల్లో లేదా మరే ఇతర కారణాలతోనో వారు బీజేపీని ఎంచుకొన్నారు. ఆ పార్టీ కోటాలో సీటు సాధించగలిగితే ఖాయంగా గెలవవచ్చన్నది వారి అంచనా. కానీ పొత్తుల చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడటం వారిలో ఆందోళన పెంచుతోంది.

 

ఇందులో వైసీపీని వదులుకొని వచ్చినవారు, కాంగ్రెస్‌లో పెద్ద స్థాయిలో ఉండి వచ్చినవారు, రిటైర్డ్ అధికారులు వంటి వారు ఉన్నారు. "సీమాంధ్రలో కేవలం బీజేపీ పేరుతో గెలిచే పరిస్థితి లేదు. అది అందరికీ తెలుసు. టీడీపీతో పొత్తు ఉంటుందనే మేం రంగంలోకి దిగాం. ఇప్పటికే కొంత ఖర్చు కూడా పెట్టాం. ఇప్పుడు తేడా వస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదు'' అని వారు వాపోతున్నారు.