తెదేపా-బీజేపీ పొత్తులు ఖరారయ్యేనా

 

బీజేపీ-తెదేపాలు ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చి చాలా కాలమే అయినప్పటికీ, తగిన సమయం కోసం వేచి చూస్తున్నాయి. కానీ, ఆ రెండు పార్టీలు కూడా తెరవెనుక ఆ విషయంపై చాలా కసరత్తు చేస్తున్నట్లు, బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు తాజా ప్రకటనతో స్పష్టమయింది.

 

ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ తెదేపాతో పొత్తులకు ఆసక్తిగా ఉందని, అందువలన రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపులపై ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తమ పార్టీ సీమాంధ్రలో ఎనిమిది లోక్ సభ, ఇరవైఐదు శాసనసభ స్థానాలను తెదేపా నుండి ఆశిస్తోందని తెలిపారు. అదేవిధంగా తెలంగాణాలో కూడా ఇరు పార్టీల బలాబలాలను బట్టి సీట్లు కేటాయించమని తెదేపాను కోరినట్లు తెలిపారు. అంతేగాక తెలంగాణాకి ముఖ్యమంత్రి అభ్యర్ధిని నిర్ణయించే అవకాశం కూడా తమ పార్టీకే ఉండాలని భావిస్తున్నట్లు తెలిపారు.

 

ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి అన్ని సీట్లు కేటాయించడం తెదేపాలో కల్లోలం సృష్టించే ప్రమాదం ఉంది. చిరకాలంగా పార్టీలో ఉన్నవారు, కాంగ్రెస్ నుండి వరదలా వచ్చి చేరుతున్న నేతలకి టికెట్స్ కేటాయించకుండా, పొత్తుల కోసమని బీజేపీకి అన్ని సీట్లు కేటాయించడం తేదేపాకు చాలా కష్టమే. అయితే, బీజేపీ ప్రధాన లక్ష్యం కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడమే తప్ప రాష్ట్రంలో అధికారం సంపాదించడం కాదు గనుక, తేదేపాకు అనుకూలంగానే సీట్ల సర్దుబాట్లకు అంగీకరించవచ్చును.

 

ఇక తెలంగాణాలో బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రి చేయాలని చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయం తీసేసుకొన్నారు. అంతే గాక బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్, కృష్ణయ్యను తెదేపా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రతిపాదిస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. కనుక, ఈవిషయంలో కూడా బీజేపీ తెదేపాతో రాజీ పడక తప్పదు.

 

ప్రస్తుతం ఆంధ్రా, తెలంగాణాలలో నెలకొన్న తీవ్రమయిన పోటీ వాతావరణంలో, తెదేపా-బీజేపీలు పొత్తులపై ఒక అంగీకారానికి రాలేకపోయినట్లయితే అవే తీవ్రంగా నష్టపోవడం తధ్యం. అందువలన ఆ రెండు పార్టీలు వీలయినంతమేర ఇచ్చి పుచ్చుకొనే ధోరణినే పాటిస్తూ పొత్తులు ఖరారు చేసుకోవడం తధ్యం. తెలంగాణా బీజేపీ నేతలు తెదేపాతో ఎన్నికల పొత్తులను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నపటికీ వారు కూడా పార్టీ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అయిష్టంగా అయినా తెదేపాతో పొత్తులకు అంగీకరించక తప్పదు.