తెదేపా ఎన్నికల సన్నాహాలు ఇంకా ఎప్పుడు మొదలవుతాయో

 

రాష్ట్ర విభజన కారణంగా తెదేపా చాలా విచిత్రమయిన, ఇబ్బందికరమయిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. రాష్ట్ర విభజన జరిగినా, జరుగకపోయినా రెండు ప్రాంతాలలో పోటీ చేయాలని భావిస్తున్నతెదేపా ఎన్నికలు దగ్గరపడుతున్నపటికీ, ఇంతవరకు తెలంగాణాపై దృష్టి కేంద్రీకరించలేకపోతోంది. ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరిగినట్లయితే, తెదేపా తెలంగాణా లో పోటీ చేయడానికి ఎన్నికల సంఘం వద్ద తమ పార్టీని జాతీయ పార్టీగా రిజిస్టర్ చేయించుకోవలసి ఉంటుంది. అంతే గాక తెలంగాణాకు ప్రత్యేకంగా ఒక అధ్యక్షుడిని, పార్టీ కార్యవర్గం, పాలక మండలి తదితర ఏర్పాట్లనీ చేసుకోవలసి ఉంటుంది. ఆ ఏర్పాట్లు చేసుకొని ఉంటే, వారు అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు గట్టిగా కృషి చేసేందుకు అవకాశం ఉండేది. అదేవిధంగా తెదేపా తెలంగాణాకు అనుకూలమనే సంకేతం ఇచ్చినట్లయి అక్కడి ప్రజలలో కూడా పార్టీ పట్ల నమ్మకం ఏర్పడేది.

 

కానీ, అదే కారణంగా పార్టీ సీమాంధ్రలో నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే తెదేపా ఇచ్చిన లేఖ కారణంగానే రాష్ట్ర విభజన జరుగుతోందని పనిగట్టుకొని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్, వైకాపాలు, ఒకవేళ తెదేపా ఈ ఏర్పాట్లు మొదలుపెట్టినట్లయితే, తెదేపా రాష్ట్ర విభజనకు మొగ్గుచూపుతోంది కనుకనే తెలంగాణా కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసుకొంటోoదని మరింత బలంగా ప్రచారం చేస్తే, సీమాంధ్రలో పార్టీకి తీరని నష్టం కలగవచ్చును. అంతే కాక తెలంగాణాకి ప్రత్యేక పార్టీ శాఖ ఏర్పాటు చేసినట్లయితే దాని కోసం ఆధిపత్యపోరు మొదలయితే, అది పార్టీని తెలంగాణాలో మరింత బలహీనపరుస్తుందనే భయం కూడా ఉండి ఉండ వచ్చును. అందుకే తెలంగాణాలో పార్టీకి తీరని నష్టం జరుగుతున్నా తెదేపా చూస్తూ వెనక్కి తగ్గవలసి వస్తోంది.

 

బహుశః వచ్చేనెల పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందితే అప్పుడు వెంటనే రెండు రాష్ట్రాలలో తెదేపా శాఖల ఏర్పాట్లు చేసుకోవచ్చును. ఒకవేళ ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరగకుంటే యధాతధంగా కొనసాగవచ్చును. పార్లమెంటులో తెలంగాణా బిల్లు బహుశః ఫిబ్రవరి ఆఖరివారంలో ప్రవేశపెట్టబడవచ్చును. అందువల్ల తెదేపా మార్చి మొదటి వారం వరకు తెలంగాణా విషయంలో అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఉంటుంది. కానీ ఈ లోగా అభ్యర్ధుల ఎంపిక ఒక కొలిక్కి వస్తే సీమాంధ్రలో పేర్లను విడుదల చేసి, ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టుకోవచ్చును.