మహానాడుకి సర్వం సంసిద్దం

 

నేటి నుండి మూడు రోజుల పాటు హైదరాబాద్, గండిపేటలో తెదేపా 34వ మహానాడు సమావేశాలు జరుగబోతున్నాయి. తెలుగుదేశం పార్టీని జాతీయపార్టీగా మార్చేందుకు ఈ మహానాడు సమావేశాలలో తీర్మానం చేసే అవకాశం ఉంది. అదే జరిగితే రెండు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షుల నియామకం కూడా చేయవలసి ఉంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఇరుగు పొరుగు రాష్ట్రాలకు తెదేపాను విస్తరించవలసి ఉంటుంది. ఈ మహానాడు సమావేశాలలో వీటన్నిటిపై చర్చలు జరిపి తీర్మానాలు చేసే అవకాశం ఉంది. కనుక ఈ 34వ మహానాడు సమావేశాలు తెదేపాకు చాలా కీలకమయినవని చెప్పవచ్చును. ఈ మూడు రోజుల సమావేశాలకి రెండు రాష్ట్రాల నుండి కనీసం 40 వేల మంది కార్యకర్తలు తరలిరావచ్చని భావిస్తున్న తెదేపా అందుకు తగ్గట్లుగానే భారీ ఏర్పాట్లు చేసింది. రెండు రాష్ట్రాల నుండి వచ్చే వాహనాల కోసం సుమారు 100 ఎకరాలలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేసారు. ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల నుండి వచ్చే పార్టీ నేతలు, కార్యకర్తల కోసం మూడు ప్రాంతాలకు చెందిన 34 రకాల శాఖాహార వంటకలాను మాగంటి బాబు పర్యవేక్షణలో సిద్దం చేస్తున్నారు. వేసవి తాపానికి తట్టుకొనేందుకు ఎయిర్ కూలర్లు, చల్లటి మజ్జిగ, మంచినీళ్ళను ఏర్పాటు చేసారు.