తెలంగాణా ముఖ్యమంత్రి అభ్యర్ధి కృష్ణయ్య

 

ఈరోజు ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో తెదేపా నిర్వహించిన ప్రజా గర్జన సభలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణా మూట మొదటి ముఖ్యమంత్రిగా బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను ముఖ్యమంత్రిగా చేస్తామని విస్పష్టంగా ప్రకటించారు. కృష్ణయ్యే తమ ముఖ్యమంత్రి అభ్యర్దని కుండబ్రద్దలు కొట్టినట్లు ప్రకటించారు. దానితో ఇంతవరకు కృష్ణయ్య అభ్యర్ధిత్వంపై పార్టీలో, బయటా కూడా జరుగుతున్న చర్చకు తెర దించినట్లయింది.

 

కొద్ది రోజుల క్రితం చంద్రబాబు కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎంపికచేశారనే మీడియాలో వచ్చిన వార్తలపై సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందిస్తూ, ‘ఆయనకు కేవలం పార్టీ ప్రచార భాద్యతలు మాత్రమే అప్పగించారు తప్ప ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కాదు’ అని ఆ వార్తలను ఖండించారు. కానీ ఈరోజు చంద్రబాబు స్వయంగా క్రుష్ణయ్యే తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ప్రకటించడంతో పార్టీలో మరో అంతర్యుద్దానికి తెరతీసినట్లయింది.

 

పార్టీ కీలకమయిన ఎన్నికలకు సన్నదమవుతున్న ఈ తరుణంలో చంద్రబాబు ఈ విధంగా ప్రకటించి, తెలంగాణాలో అత్యధిక శాతం ఉన్న బీసీలను ఆక్కట్టుకోవాలని ఆశిస్తుండవచ్చును. కానీ పార్టీలో ఉన్న అనేక మంది సీనియర్లను కాదని, ఎటువంటి రాజకీయ, పరిపాలనానుభవమూ లేని, రెండు మూడు వారాల క్రితం కొత్తగా పార్టీలో చేరిన కృష్ణయ్యను ముఖ్యమంత్రిని చేస్తానని ఆయన ప్రకటిస్తే పార్టీలో మళ్ళీ సంక్షోభం ఏర్పడదా? దానినాయన ఏవిధంగా పరిష్కరించబోతున్నారు? అనేది చాలా ఆసక్తికరంగా మారింది.

 

అయితే ఇటీవల ఒక ప్రముఖ టీవీ చానల్ వారు మల్కాజ్ గిరీలో వివిధ పార్టీ నేతలను ప్రజాదర్బారు కార్యక్రమంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు కృష్ణయ్య పక్కనే కూర్చొన్న కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ అన్న మాటలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. “తెలంగాణాలో తెదేపా మునిగిపోయే నావ వంటిదని చంద్రబాబుకి తెలుసు గనుకనే ఆ నావకు క్రుష్ణయ్యను కెప్టెన్ చేసారు. చంద్రబాబుకి నిజంగానే బీసీలను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకొంటే, తేదేపాకు విజయావకాశాలున్న సీమాంద్రాలో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించేవారు. కానీ అక్కడ తను ముఖ్యమంత్రి పదవి తీసుకొని, ఓడిపోయే ప్రాంతంలో కృష్ణయ్యను ముఖ్యమంత్రిని చేస్తానని ఆయనను బకరా చేసారు,” అని కృష్ణయ్య సమక్షంలోనే అన్నారు.

 

ఆయన వాదన నిజమనుకొన్నపటికీ, ఒకవేళ తెదేపా-బీజేపీ కూటమి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తే, అప్పుడు చంద్రబాబు తన మాటను వెనక్కు తీసుకోలేరు కదా! ఒకవేళ తీసుకోదలిస్తే, ఆ నెపం బీజేపీ మీద వేస్తారా? కాలమే దీనికి సమాధానం చెపుతుంది.