బీజేపీ, టీడీపీ భాయీ భాయీ : కలసి పనిచేస్తారట

 

భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య ఏర్పడిన అంతరం తొలగిపోయింది. రెండు పార్టీలూ ఈ ఎన్నికలలో స్నేహపూర్వక వాతావరణంలో కలస పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. బీజేపీ తనకు కేటాయించిన స్థానాల్లో బలహీనులైన అభ్యర్థులను నిలబెట్టిందని ఆగ్రహించిన చంద్రబాబు సీమాంధ్రలో బీజీపీతో కటిఫ్ చెప్పాలని భావించారు. అయితే బీజేపీ కేంద్ర నాయకత్వంతోపాటు, ఆంధ్రప్రదేశ్ నాయకత్వం కూడా చంద్రబాబుతో చర్చలు జరిపింది. ఢిల్లీ నుంచి ప్రకాష్ జవదేకర్ ప్రత్యేకంగా వచ్చి చంద్రబాబుని కలిసి చర్చలు జరిపారు. ఇరు పార్టీల మధ్య వున్న అభిప్రాయ భేదాల విషయంలో చర్చించి, వాటన్నిటినీ క్లియర్ చేశారు. ఆ తర్వాత రెండు పార్టీల ప్రతినిధులూ తమ మధ్య పొత్తు కొనసాగుతుందని ప్రకటించారు. రెండు పార్టీలు ఈ ఎన్నికలలో కలసి పనిచేసి విజయం సాధిస్తాయని వారు అన్నారు. సీమాంధ్రలో బీజేపీకి కేటాయించిన కొన్ని అసెంబ్లీ సీట్లను ఆ పార్టీ వదులుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఒక స్థానాన్ని వదులకుంటున్నామని బీజేపీ ప్రకటించినప్పటికీ, నామినేషన్ల చివరి రోజైన రేపటికి మరిన్ని స్థానాలు వదులుకునే అవకాశం వుందని తెలుస్తోంది.