తెదేపా-బీజేపీ పొత్తులకు అంతిమ క్షణాలు

 

తెదేపా-బీజేపీ పొత్తులు నామినేషన్లకు ముందే ముగిసిపోయేలా ఉన్నాయి. బీజేపీకి కేటాయించిన స్థానాలలో చాల బలహీనమయిన అభ్యర్ధులను నిలబెట్టినందుకు చంద్రబాబు కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. నామినేషన్లు వేయడానికి ఇంకా రెండు రోజులు గడువు ఉంది గనుక, ఈలోగా మరొకసారి సర్వే చేయించుకొని, తగిన అభ్యర్ధులను పోటీలో నిలబెట్టమని ఆయన బీజేపీ అధిష్టానానికి సూచించినట్లు సమాచారం. ఒకవేళ బీజేపీ సానుకూలంగా స్పందించకపోయినట్లయితే, ఆపార్టీకి కేటాయించిన అన్ని స్థానాలలో తమ అభ్యర్ధుల చేత నామినేషన్లు వేయించేందుకు కసరత్తు కూడా ఆరంభించారు.

 

మొదట విశాఖ నుండి తెదేపా తరపున లోక్ సభకు పోటీ చేయాలనుకొన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, బీజేపీతో పొత్తుల కారణంగా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి నామినేషన్ వేయవలసి వచ్చింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకవేళ బీజేపీతో పొత్తులు తెగతెంపులయ్యే పక్షంలో తనను మళ్ళీ విశాఖ నుండి లోక్ సభకు పోటీ చేసేందుకు సిద్దంగా ఉండమని అధిష్టానం నుండి కబురు వచ్చిందని చెప్పడం చూస్తే, తెదేపా తెగతెంపులకే సిద్దం అవుతున్నట్లు స్పష్టమవుతోంది. అదేవిధంగా నరసాపురం నుండి బీజేపీ తరపున లోక్ సభకు పోటీ చేద్దామనుకొన్న బీజేపీ నేత ఈరోజు ఉదయమే చంద్రబాబుని కలిసి, ఒకవేళ పొత్తులు తెంచుకొన్నట్లయితే తాను తెదేపా టికెట్ పై నరసాపురం నుండి పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని తెలియజేసారు.

 

కానీ, ఈవిషయమే చర్చించదానికి నేడు డిల్లీ నుండి హైదరాబాద్ కు వచ్చిన బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ, తెదేపా-బీజేపీల బంధం చాల బలమయినదని, చిన్న చిన్న సమస్యలకు అది విచ్చినమయిపోయెంత బలహీనమయినది కాదని, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రెండు పార్టీలు కలిసి ముందుకు సాగుతాయని అన్నారు. ఆ పార్టీ నేత వెంకయ్య నాయుడు కూడా ఇంచుమించు అదే అభిప్రాయం వ్యక్తం చేసారు. అయితే ఈరోజు సాయంత్రంలోగా బీజేపీ తన అభ్యర్ధులను మార్చడమో, లేక తెదేపా సూచించిన వారికే టికెట్స్ కేటాయించడమో చేయవచ్చని ఇరు పార్టీలలో కొందరు నేతలు భావిస్తున్నారు. ఒకవేళ సీమాంద్రాలో పొత్తులు పెటాకులయితే, ఇదే అదునుగా తెలంగాణాలో తెదేపాతో పొత్తులు తెంచుకోవాలని తెలంగాణా బీజేపీ నేతలు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.