బీజేపీ-తెదేపా పొత్తుల కధ కొలిక్కి వచ్చేనా?

 

రోజులు గడిచిపోతున్నాపార్టీల మధ్య పొత్తులు మాత్రం కుదరడం లేదు. కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకొందామని ఆత్రపడుతున్న సీపీఐ, బీజేపీతో పొత్తులు పెట్టుకొందామని ఉవ్విళ్ళూరుతున్న తెదేపాలకి సీట్ల బేరం ఎంతకీ తెగకపోవడంతో ఎన్నికల షెడ్యుల్ విడుదలయినప్పటికీ పార్టీలు తమ అభ్యర్ధుల పేర్లను కూడా ప్రకటించుకోలేని దుస్థితి ఏర్పడింది. ఇక తెదేపా-బీజేపీల పొత్తులు బెడిసికొడితే, బీజేపీతో చేతులు కలుపుదామని తెరాస ఆత్రంగా ఎదురుచూస్తుంటే, తెరాస కరుణిస్తే ఆపార్టీతో పొత్తులు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎదురుచూస్తోంది. అదేవిధంగా వైకాపా కూడా బీజేపీ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. అంటే తెదేపా-బీజేపీల పొత్తులను బట్టి ఆంధ్ర తెలంగాణాలలో రాజకీయ సమీకరణాలు మారుతాయన్నమాట.

 

ఇక ఈమధ్య కాలంలో తెదేపా రెండు ప్రాంతాలలో కొంచెం బలం పుంజుకోవడంతో చంద్రబాబులో మళ్ళీ ఆత్మవిశ్వాసం పెరిగింది. అందువలన బీజేపీ గొంతెమ్మ కోరికలన్నిటినీ తాము అంగీకరించావలసిన అవసరం లేదన్నట్లు కొంచెం బెట్టు ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా బీజేపీ కూడా తెదేపాతో పొత్తు పెట్టుకోకపోతే తెరాస, వైకాపాలు ఉండనే ఉన్నాయనే ధీమాతో బిగుసుకొని కూర్చొంది. దానివలన రెండు పార్టీల మధ్య పొత్తుల ముచ్చట్లు టీవీ ధారావాహికంలాగ కొనసాగుతూనే ఉన్నాయి.

 

ఇక ఆ రెండు పార్టీలు ఏదో ఒకటి తేల్చుకొని తమ తమ అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తే, దానిని బట్టి తమ అభ్యర్ధులను కూడా ప్రకటించుకొందామని మిగిలిన పార్టీలు ఓపికగా ఎదురుచూస్తున్నాయి. ముందుగా తమ అభ్యర్ధుల జాబితా విడుదలచేసినట్లయితే పార్టీలో టికెట్స్ దొరకనివారి అసమ్మతికి తోడు, తమ అభ్యర్ధులను బట్టి ప్రత్యర్ధులు బలమయిన అభ్యర్ధులు నిలబెడితే మొదటికే మోసం వస్తుందని అన్ని పార్టీలు అభ్యర్దుల పేర్లు ప్రకటించడానికి మీన మేషాలు లెక్కిస్తూ రోజులు దొర్లించేస్తున్నాయి. ఇక తమకు పార్టీ టికెట్ దొరకకపోతే వేరే పార్టీలోకి జంపైపోదామని ఎదురుచూస్తున్న వారికి కొదవలేదు. వారు కూడా ఆ సుమూహూర్తం కోసం ఆశానిరాశలమాధ్య ఊగిసలాడుతూ బీపీలు పెంచేసుకొంటున్నారు.

 

ఈవిదంగా అన్ని పార్టీలు కలిసి పొత్తులు, టికెట్స్ అంశాలు పట్టుకొని ఒకదానితో మరొకటి దాగుడు మూతలు ఆడుకొంటున్నాయి. అందువల్ల ఈసమస్యలన్నీ పరిష్కారం అవ్వాలంటే ముందుగా తెదేపా-బీజేపీల మధ్య వెంటనే పొత్తులయినా కుదరాలి, లేకుంటే పొత్తులు పెటాకులయినా అయిపోవాలి. అప్పుడు గానీ ఈ సమస్య ఒక కొలిక్కి రాదు. కానీ తెలంగాణాలో నామినేషన్స్ వేయడానికి ఇంకా కేవలం ఆరు రోజులు మాత్రమె మిగిలి ఉన్నాయి గనుక మహా అయితే మరో ఐదు రోజులు ఈ పొత్తుల సస్పెన్స్ ధారావాహికం కొనసాగవచ్చును. అంటే ఇక ఏ పార్టీ మరే పార్టీకి అంతకు మించి డెడ్ లైన్స్ ఇవ్వలేవన్నమాట. బహుశః ఇటువంటి పొత్తుల భాగోతం మునుపెన్నడూ చూడలేదేమో.