పొత్తులు సరే..నేతలు సహకరించుకొంటారా?

 

తెలుగుదేశం-బీజేపీల మధ్య పొత్తులు దాదాపు ఖరారయినట్లు తాజా సమాచారం. తెలంగాణాలో ఎనిమిది లోక్ సభ, 45 అసెంబ్లీ సీట్లను బీజేపీకి కేటాయించేందుకు తెదేపా ఇప్పటికే సంసిద్దత వ్యక్తం చేస్తుండగా, అందుకు దాదాపు అంగీకరించిన బీజేపీ వీలయితే అదనంగా మరి కొన్ని స్థానలయినా సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల బహుశః ఈరోజు లేదా రేపటికల్లా పొత్తులు కధ సుఖాంతమయినట్లు ప్రకటించే అవకాశం ఉంది.

 

అయితే ఇంతకాలం తెదేపాతో పొత్తులను తీవ్రంగా వ్యతిరేఖించిన కిషన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి వంటి బీజేపీ నేతలు తేదేపాకు ఎంతవరకు సహకరిస్తారనేది ప్రశ్నార్ధకమే. రెండు పార్టీల మధ్య పొత్తులు కుదిరినప్పటికీ బీజేపీ నేతలు సహకరించకపోయినట్లయితే, అప్పుడు తెదేపా నేతలు కూడా అదేవిధంగా వ్యవహరించవచ్చును. అదే జరిగితే రెండు పార్టీల అభ్యర్ధులకు తీవ్ర నష్టం జరగవచ్చును. అందువల్ల తెదేపా-బీజేపీ అగ్రనేతలు పొత్తులకోసం ఎంత శ్రమించారో, తమ నేతల మధ్య సహకారం పెరిగేందుకు కూడా అంతే శ్రమించ వలసి ఉంటుంది. లేకుంటే వారి మధ్య ఉన్న ఈ విభేదాల వలన కాంగ్రెస్, తెరాసలు ప్రయోజనం పొందడం తధ్యం.