టీడీపీకి దూరం అవుతున్న వల్లభనేని వంశీ

 

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు కూడా కృష్ణా జిల్లా తెదేపాకు ఎప్పుడూ కంచుకోటగానే నిలుస్తోంది. నందమూరి కుటుంబానికి ఆ జిల్లాతో ఉన్న ప్రత్యేక అనుబంధం అక్కడి ప్రజలు తెదేపాను తమ స్వంత పార్టీగా భావించి ఆదరించడం ఒక కారణమయితే, నిత్య రాజకీయ చైతన్యంతో తొణికిసలాడే కృష్ణా జిల్లాలో తెదేపాకు బలమయిన నేతలు చాలామందే ఉండటం అందుకు మరో కారణమని చెప్పవచ్చును. అయితే, ఇప్పుడు ఆ రెండో కారణమే ఆ పార్టీకి ఊహించని ఇబ్బందులు తెస్తోంది.

 

ఒక ఒరలో రెండు కత్తులే ఇమడలేనప్పుడు అనేక కత్తులు ఎలా ఇముడుతాయి? ప్రస్తుతం కృష్ణా జిల్లాలో వల్లభనేని వంశీ, కశినేని నాని, బుద్దా వెంకటేష్, నాగుల్ మీరా, ఇటీవలే పార్టీలో చేరిన దేవినేని చంద్రశేఖర్ వంటి వారే కాకుండా చాల మంది బలమయిన నాయకులున్నారు. ఒకసారి రాజకీయాలలో ప్రవేశించిన తరువాత ఎవరయినా తనకంటూ పార్టీలో, తన ప్రాంత ప్రజలలో ఒక గుర్తింపు కలిగి ఉండాలని కోరుకోవడం సహజమే. అయితే, ఇంత చిన్న పరిధిలో ఎక్కువమంది రంగంలో ఉన్నపుడు వారి మద్య పోటీ, తత్ఫలితంగా యుద్ధాలు కూడా అనివార్యమే. అయితే, అది ఒక పరిధి దాటినప్పుడు వారి మనుగడకే కాకుండా పార్టీకి కూడా నష్టం కలుగుతుంది. ఆ సంగతి అందరికీ తెలిసి ఉన్నపటికీ, ఒకరిపై మరొకరు పైచేయి సాధించుకొనే ప్రయత్నంలో యుద్ధాలు, గెలుపు ఓటములు కూడా తప్పడం లేదు.

 

గత దశాబ్ద కాలంగా కృష్ణా జిల్లాలో తేదేపాకు తిరుగులేని నాయకుడిగా వెలుగొందుతున్న వల్లభనేని వంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కృష్ణా జిల్లాలో తెదేపా బలపడేందుకు ఆయన చాల కృషి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దేవినేని నెహ్రు వంటి బలమయిన కాంగ్రెస్ నేతలను డ్డీ కొనడంలో వల్లభనేని చూపిన తెగువ, దైర్య సాహసాలను అందరు మెచ్చుకొన్నపటికీ, ఆయన దూకుడుతనం మాత్రం అప్పుడప్పుడు పార్టీకే కాక ఆయనకీ కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది.

 

అయితే, ఇటీవల కాలంలో కేశినేని నాని క్రమంగా ఆయన స్థానం ఆక్రమిస్తూ ఆయనను వెనక్కు నెట్టివేస్తున్నట్లు కనిపిస్తోంది. అది ఇటీవల చంద్రబాబు కృష్ణ జిల్లా పాదయాత్రలో స్పష్టంగానే కనబడింది. చంద్రబాబు పాదయాత్ర జిల్లాలో అడుగుపెట్టినపుడు వల్లభనేని వంశీ చురుకుగా పాల్గొన్నారు. అయితే, కేశినేని నాని రంగ ప్రవేశంతో ఆయన పాదయాత్ర నుండి దాదాపు కనుమరుగైపోయారు. కారణాలు ఎవయినప్పటికీ చంద్రబాబు కూడా ఆయన పట్ల కొంత నిర్లక్ష్యం కనబరిచినట్లే ఉంది. తత్ఫలితంగా వల్లభనేని వంశీ పార్టీకి మరింత దూరం జరిగినట్లు కనిపించింది.

 

అయితే, నిన్న చంద్రబాబు తన పాదయాత్రకు ఒకరోజు విరామం ఇచ్చినప్పుడు కృష్ణా జిల్లా నేతల మద్య నివురు గప్పిన నిప్పులా రగులుకొంటున్న విభేదాలను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా వల్లభనేని వంశీ, కేశినేని నాని, బుద్దా వెంకటేష్ మరియు నాగుల్ మీరాలతో విడివిడిగా భేటీ అయ్యి వారి అభిప్రాయాలను తెలుసుకొన్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే ముందుగా నాయకుల మద్య సయోధ్య అవసరమని, అందువల్ల తనతో విభేదించే వంశీ స్థానంలో వెనుకబడిన వర్గాలకు చెందిన నాగుల్ మీరాకు అర్భన్ అధ్యక్ష పదవిని ఈయమని కేశినేని నాని కోరడంతో చంద్రబాబుకు సరికొత్త సమస్య ఎదురయింది.

 

పార్టీకోసం ఎంతో కష్టపడిన వల్లభనేని వంశీని అర్భన్ అధ్యక్ష పదవి నుండి తప్పించడం ఆయనకు ఇష్టం లేకపోయినప్పటికీ, పార్టీ శ్రేయస్సు దృష్ట్యా సరేననక తప్పలేదు. అందుకు వల్లభనేని చాలా ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అయితే, వంశీని రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకొని ఆయనకు కీలక బాద్యతలు అప్పగించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. అయినప్పటికీ, వంశీ ఆగ్రహం చల్లారలేదని తెలుస్తోంది. కానీ, చంద్రబాబుకి కూడా ఇంతకంటే వేరే మార్గం లేదు.

 

తాజా కూర్పులో కేశినేని నానికి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు, నాగుల్ మీరాకు అర్భన్ అధ్యక్ష పదవి, విజయవాడ పశ్చిమానికి ఇన్ చార్జిగా బుద్దా వెంకన్న, మద్య నియోజక వర్గంలో బొండా ఉమా, తూర్పున గద్దె రామ్మోహన్ ఉండేలా నిర్ణయం అయింది. అయితే, వల్లభనేని వంశీని అర్బన్ అధ్యక్ష పదవి నుండి తప్పించడానికి నిర్ణయం తీసుకోన్నపటికీ, ఆయనకు రాష్ట్ర కార్యవర్గంలో సముచిత పదవినిస్తూ తెదేపా అధిష్టానం ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయక పోవడంతో సహజంగానే కొంచెం ఆవేశపరుడయిన ఆయనకి మరింత కోపం కలిగించడంతో పార్టీ అధిష్టానానికి అందుబాటులో లేకుండా తన ఫోన్ స్విచ్చ్ఆఫ్ చేసుకొన్నట్లు తెలుస్తోంది.

 

అటువంటి బలమయిన నాయకుడిని తెదేపా కనుక వదులుకొంటే ఆయన చేయి అందుకోవడానికి వైయస్సార్ కాంగ్రెస్ సిద్దంగా ఉంటుందని తెదేపా అధిష్టానం గ్రహించకపోతే అది ఆ పార్టీకే తీరని నష్టం కలిగిస్తుందని చెప్పవచ్చును. గతంలో జిల్లాలో బలమయిన నాయకుడయిన దేవినేని నెహ్రును కూడా ఇదేవిధంగా కోల్పోయిన తెదేపా ఆ తరువాత మళ్ళీ నిలదొక్కుకోవడం కోసం ఎంత ఇబ్బంది పడిందో అందరికీ తెలుసు. మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుందా లేక తెదేపా చేతులు కాలక ముందే జాగ్రత్త పడుతోందో త్వరలోనే తేలుతుంది.