తెదేపా అడుగుజాడలలో నడుస్తున్న వై.యస్సార్.సి.

 

యుద్దరంగంలోకి ప్రవేశించిన తరువాత తమను ముందుకు నడిపించే నాయకుడు కనబడకపోతే సైనికుల పరిస్తితి ఏవిదంగా ఉంటుందో, ప్రస్తుతం వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ పరిస్తితి కూడా అలాగనే ఉందని చెప్పవచ్చును. ఒక వైపు తనపై శతృవులు చేస్తున్న దాడిని ఎదుర్కొంటూనే, మరోవైపు అదే శత్రువ్యుహాలని అమలుచేస్తూ ఎలాగో నెట్టుకొస్తోంది వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు.

 

చంద్రబాబు వెనుకే పాదయాత్రలు మొదలుపెట్టిన షర్మిల ఈమద్యనే మోకాలిగాయం వల్ల తన పాద యాత్రను విరమించుకోక తప్పలేదు. గానీ, చంద్రబాబు మాత్రం ఇంకా తన పాదయాత్రని కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే, షర్మిల మద్యలో ఆపిన పాదయాత్రని కొనసాగించే నాయకుడు వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీకి కరువవడం చాలా దురదృష్టకరం అని చెప్పవచ్చును. పార్టీ అధినేత జగన్ జైలులో ఉండిపోవలసి రావడం, విజయమ్మ ఆరోగ్యం మరియు ఆమె వయసు రీత్యా పాద యాత్రలను చేయలేని పరిస్తితి.

 

 వీరికి సముజ్జీగా నిలిచే మరోనేత పార్టీలో లేకపోవడం అన్నీ కలగలిసి, వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీని తన శత్రుపార్టీలముందు బలహీనంగా మిగిల్చింది. అయితే, ఆ పార్టీ అందుకు తరుణోపాయంగా తన శత్రువయిన తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తున్న రాజకీయ కార్యక్రమాలను తాత్కాలికంగానయినా అనుసరించడమే ఉత్తమం అని నిర్ణయించుకొనట్లు కనిపిస్తోంది. అందుకే, చంద్రబాబు నిన్న పత్తి రైతులకు మద్దతుగా తాను ఎనుమురులో ధర్నా చేయబోతునట్లు ప్రకటించగానే, వెంటనే వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ కూడా తానుకూడా మహబూబ్ నగర్ లో పత్తి రైతులకి మద్దతుగా ధర్నా చేయబోతునట్లు ప్రకటించింది. బహుశః, మరే ఇతర రాజకీయపార్టీ ఇంత ధైన్యస్తితిని చూసి ఉండకపోవచ్చును.

 

ఇప్పటికయినా వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ వెంటనే మేల్కొని తన రాజకీయ కార్యక్రమాలను ముందుండి నడిపించగల సమర్డుడయిన నాయకుడిని తప్పనిసరిగా కనుక్కోవలసిన అవసరం ఉంది. నాయకుడు లేని పార్టీ గుర్రాలులేని రధం వంటిది.

 

కేవలం, పార్టీలో ఉన్న ఉపనాయకులతో పార్టీని నడిపించాలని చూస్తే, అటువంటి వారు నిరుడు ప్రజారాజ్యం పార్టీకి పట్టించిన గతే వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీకి పట్టించి తమదారి తాము చూసుకొనే ప్రమాదం ఉంది. ఇటీవల కాలంలో వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీకి సానుభూతి చూపుతున్న వై.యస్.వివేకానంద రెడ్డి గానీ, అందరూ ఊహిస్తునట్లుగా జగన్ అర్దాంగి శ్రీమతి భారతిగారు గానీ త్వరలో పార్టీ పగ్గాలు చెప్పట్టవచ్చునని రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్నారు. ఏది ఏమయినపటికీ వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ మాత్రం వెంటనే మేలుకొని తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.