టీ-కాంగ్రెస్ ఏంపీల రాజీనామాలు నేడే

 

టీ-కాంగ్రెస్ యంపీలు తెలంగాణాపై స్పష్టమయిన ప్రకటన చేసేందుకు అధిష్టానానికి విదించిన గడువు ఈ రోజుతో ముగుస్తున్నపటికీ ఎవరూ కూడా పట్టించుకోలేదు. కనీసం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ వారిని బుజ్జగించే ప్రయత్నం చేయకపోవడంతో అవమానకర పరిస్థితుల్లో వారు తెరాసలోకి వెళ్ళవలసి వస్తోంది. ఈ రోజు యంపీ వివేక్ ఇంటికి తెరాస అధ్యక్షుడు కేసీఆర్ వచ్చి వారితో టికెట్స్ ఖరారు చేసిన తరువాత, వారు పార్టీకి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించవచ్చును.

 

కానీ, వారిలో రాజయ్యకు మాత్రం కేసీఆర్ టికెట్ ఖరారు చేయకపోవడంతో ఆయన మరికొంత కాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉండేందుకు నిశ్చయించుకొన్నట్లు తెలుస్తోంది. కే.కేశవ్ రావ్ మరియు టీ-కాంగ్రెస్ యంపీలు-వివేక్, మందా జగన్నాథం వచ్చే నెల 2న హైదరాబాద్ నిజం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో అధికారికంగా తెరాసలో జేరుతారు.

 

టీ-కాంగ్రెస్ యంపీలు పార్టీ నుండి వెళ్లిపోతున్నా కూడా అధిష్టానం ఖాతరు చేయనట్లు నటిస్తున్నపటికీ, వారి వెనుక మరి కొందరు శాసన సభ్యులు కూడా వెళిపోతే, కిరణ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోతుందని ఆందోళన చెందుతోంది.

 

ఇక, తెలుగుదేశం పార్టీ ఎంతో ఘనంగా మహానాడు సమావేశాలు నిర్వహించుకొని రెండు రోజులయినా కాక మునుపే మెహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూల్ ఇన్-చార్జ్ మర్రి జనార్ధన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసారు. గత ఉపఎన్నికలలో ఆయన నాగం జనార్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆయన కూడా తెరసాలోకి వెళ్లవచ్చునని సమాచారం.