పవన్ కళ్యాణ్ బర్త్ డే.. 2000కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ప్లాన్!!

 

యువత మీద మీడియా ప్రభావం ఎంత ఉందో తెలీదు కానీ.. సోషల్ మీడియా ప్రభావం మాత్రం గట్టిగా ఉంది. అందుకే రాజకీయ పార్టీలు కూడా యువతను ఆకర్షించడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నాయి.. యువతను పక్కదోవ పట్టిస్తున్నాయి. ఒక పార్టీకి చెందిన వ్యక్తులు ప్రత్యర్థి పార్టీ వ్యక్తుల మీద ఏదోక తప్పుడు వార్తను సృష్టించి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. దీంతో అది నిజమనుకొని పలువురు నమ్ముతున్నారు. దీని మూలంగా ఆ వ్యక్తి ప్రతిష్టకు నష్టం జరుగుతుంది. ఇలా ఏదో ఒక పార్టీ అని కాదు.. చాలా పార్టీలు ఇలానే చేస్తున్నాయి. ప్రత్యర్థుల మీద అర్థంపర్థం లేని ఆరోపణలు చేసి, సోషల్ మీడియాలో రచ్చ చేయడం తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా వైసీపీ సోషల్ మీడియా విభాగం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి ఆరోపణలే చేసి.. జనసైనికుల ఆగ్రహానికి గురవ్వడమే కాకుండా, నెటిజనుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోంటోంది.

సెప్టెంబర్ 2 న పవన్ పుట్టిన రోజు ఉండటంతో జనసైనికులు ఆయనకు గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తున్నారు. పవన్ సినిమాలను వదిలేసి పూర్తి సమయం రాజకీయాలకే వెచ్చిస్తున్నారు. దీంతో పార్టీ నడిపేందుకు వీలుగా భారీ మొత్తాన్ని ఆయనకు విరాళంగా ఇవ్వాలని జనసైనికులు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పవన్ అభిమానులు తమకు తోచిన మొత్తాన్ని సాయం చేస్తున్నారు. అయితే ఇదంతా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చాలనే ప్లాన్‌ అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు వైసీపీ సోషల్ మీడియా అధికారిక పేజీలో పవన్ మీద సంచలన ఆరోపణలు చేసారు.

 

 

"పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు దాదాపు 2000కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చాలనే ప్లాన్ లో అమెరికాలోని తానా వర్గం ఉన్నట్టుగా సమాచారం. అందుకే పవన్ అభిమానుల ముసుగులో విరాళాలు వసూలు చేసి, వాటికి చంద్రబాబు ఇచ్చిన బ్లాక్ మనీ కలిపి.. దానిని వైట్ మనీగా మార్చడానికి పక్కా పథకాన్ని ప్లాన్ చేసినట్టు ఇప్పటికే కొంతమంది పవన్ అభిమానులు గుర్తించి తీవ్ర నిరాశతో ఉన్నారు." అని వైసీపీ సోషల్ మీడియా విభాగం ఫేస్ బుక్ పేజీలో సంచలన పోస్ట్ చేసింది.

ఈ పోస్ట్ చూసిన జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "మీ ఆరోపణ నిజమైతే అధికారంలో ఉన్నారు కదా చట్టపరంగా చర్యలు తీసుకోకుండా మీరు ఏం చేస్తున్నారు? ఎన్నాళ్ళు జనసేనను ఎదగనీకుండా తప్పుడు ఆరోపణలు చేస్తారు ? జనసేన అంటే ఎందుకంత భయం?" అని జనసైనికులు నిలదీస్తున్నారు. మేము పార్టీకి విరాళంగా ఇవ్వబోయే ప్రతీ రూపాయి మా కష్టార్జితం. మేము ఇచ్చే డబ్బులు ప్రతిదానికి లెక్క చూపిస్తాం. వైసీపీ చేసిన ఈ ఆరోపణలకు ఒక్క సాక్ష్యం అయినా చూపించాలి అని జనసైనికులు ఛాలెంజ్ విసురుతున్నారు.

అసలు పవన్ కు డబ్బులే ముఖ్యం అనుకుంటే తాను ఇప్పుడు సినిమాలకు ఒప్పుకున్నా సరే కోట్లు ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉంటారు. ఏవైనా బ్రాండ్స్ కు ప్రకటనలు చేసుకున్నా సరే ఎన్నో డబ్బులు వస్తాయి. అలాంటిది కేవలం డబ్బులు కోసమే పవన్ రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీతో కుమ్మక్కు అయ్యారని ప్రచారం చెయ్యడం ఏమాత్రం సమంజసం కాదని పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని నెటిజన్లు కూడా మండిపడుతున్నారు.