నేను కిషన్ రెడ్డికి ఫోన్ చేశా.. కానీ ఆయన నన్ను పట్టించుకోలేదు: తలసాని

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి మణిహారం మెట్రో రైల్. తాజాగా మెట్రో రైల్లో కీలకమైన జేబీఎస్, ఎంజీబీఎస్ మార్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి ఏడవ తేదీన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి కిషనరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. సరిగ్గా ఇక్కడే వివాదం రాజుకుంది. స్థానిక ఎంపీగా ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానం అందలేదని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఓ వైపు పార్లమెంట్ జరుగుతుంటే ముందస్తు సమాచారం లేకుండా ప్రారంభోత్సవం అధికార పార్టీ కార్యక్రమాల వలె చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. 

అయితే కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి తలసాని స్వయంగా కేంద్ర మంత్రికి తానే ఫోన్ చేశానని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున తాను రాలేనని కిషనరెడ్డి చెప్పారని ఇప్పుడు ఇలా విమర్శలు చేయడం సరికాదంటూ తలసాని వెల్లడించారు. అదేవిధంగా ప్రొటోకాల్ విషయంలో కేంద్ర మంత్రికి ఇప్పటి వరకు ఎక్కడా లోటు రానీయలేదని తెలిపారు. ఇలా ఇద్దరు మంత్రుల విమర్శలకు ప్రతి విమర్శ చేసుకోగా అంతా వివాదం సద్దుమణిగిందని అనుకున్నారు. ఇంతలోనే ప్రొటోకాల్ పై రాష్ట్ర మంత్రి తలసాని మరో వివాదాన్ని తెరమీదకు తెచ్చారు. 

ఈ నెల 18వతేదీన దక్షిణ మధ్య రైల్వేలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బోయిగూడ వైపు జరగనుంది. అయితే బోయిగూడ పరిధి తన అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోనే ఉందని తనకెందుకు ఆహ్వానం పంపలేదు అంటూ ట్విట్టర్ వేదికగా కిషన్ రెడ్డిని తలసాని ప్రశ్నించారు. ఇటీవల మెట్రో రైలు ప్రారంభోత్సవానికి పిలవలేదని కిషనరెడ్డి రాద్దంతం చేశారని తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమానికి కనీసం సమాచారం ఇవ్వలేదని ట్విట్టర్ లో కిషన్ రెడ్డి పై మంత్రి శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. తాము కిషన్ రెడ్డిలా చీప్ పాలిటిక్స్ చేయమని హుందాతనంగా ఉంటామని కిషన్ రెడ్డికి చురకలు అంటించారు. ఇక తనను పిలవక పోవడంపై కిషనరెడ్డి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. అటు కేంద్ర మంత్రి ఇటు రాష్ట్ర మంత్రి మధ్య నెలకొన్న మెట్రో వివాదం ఎక్కడికి దారి తీస్తోందనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతుంది.