ఉద్యమంలో కేసీఆర్ పనిచేశారు.. ఎవరు అధికారంలోకి వస్తే ఏంటి?

 

మొన్నటివరకు సైలెంట్ గా ఉన్న విజయశాంతి.. ముందస్తు ఎన్నికలకు తెరలేవడం, కాంగ్రెస్ పార్టీ ఆమెని స్టార్‌ క్యాంపెయినర్‌ గా ప్రకటించడంలో ఒక్కసారిగా దూకుడు పెంచారు. అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ నిర్వహించిన రోడ్‌షోలో ఆమె మాట్లాడుతూ.. ఉద్యమం నాటి కేసీఆర్‌ వేరు, అధికారంలో ఉన్న కేసీఆర్‌ వేరని అన్నారు. గత ఎన్నికల్లో తెరాస వైపు గాలి వీచిందని, ఉద్యమంలో ఆయన పనిచేశారు గనక ఎవరు అధికారంలోకి వస్తే ఏంటి? ఆయన పాలన చూద్దామని ఇన్నాళ్లూ ఎదురుచూస్తే.. ఈ నాలుగున్నరేళ్లలో దోపిడీ చేశారని విమర్శించారు.

ప్రజలు ఓట్లేసింది కేసీఆర్‌ కుటుంబం కోసం కాదని, ప్రజా సంక్షేమం కోసమన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 4వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. లోపం ఎక్కడుందని నిలదీశారు. రైతులకు చేయాల్సినంత మేలు చేయలేదు కాబట్టే వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ఎన్ని తీసుకొచ్చినా రైతుల గుండెల్లో మాత్రం కేసీఆర్‌కు చోటులేదన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ కాంగ్రెస్‌ తెచ్చినప్పటికీ దాన్ని సక్రమంగా విద్యార్థులకు చెల్లించడంలేదన్నారు. ఉద్యోగం వస్తే తమ తల్లిదండ్రులను పోషించుకుంటానని ఆశతో ఎదురుచూస్తున్న యువతకు కూడా నిరాశే ఎదురవుతోందని చెప్పారు. కేజీ టు పీజీ విద్య అని చెప్పి ఐదు వేల ప్రభుత్వ పాఠశాలలు మూసివేయించడం ఘోరం కాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రగతిభవన్‌లో కూర్చొని పాలిస్తున్నారు తప్ప ప్రజల్లోకి వచ్చి వారి సమస్యలను తెలుసుకోవడంలేదన్నారు. తమ సమస్యలు చెప్పుకొనేందుకు ప్రజలు ప్రగతి భవన్‌కు వెళ్దామన్నా అనుమతించడంలేదని విమర్శించారు. మళ్లీ ఈ ఎన్నికల్లో ప్రజలు మోసపోవద్దని.. కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలని విజయశాంతి ప్రజలను కోరారు. తెలంగాణ ప్రజలు గత ఎన్నికల్లో తెరాసకు ఓటు వేసి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసి మోసపోయారని, మళ్లీ ఆయనను గెలిపించి మోసపోవద్దని విజయశాంతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.