తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి పరిపూర్ణానంద..!!

 

శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద భాజపాలో చేరారు.భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌లతో భేటీ అనంతరం ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు. తమ పార్టీలోకి వచ్చిన పరిపూర్ణానందకు అమిత్‌ షా తన నివాసంలోనే పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయనకు ప్రాథమిక సభ్యత్వ రసీదును అందజేశారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద మాట్లాడుతూ రాంమాధవ్‌తో గతంలోనే చర్చించాను. అనంతరం అమిత్‌ షాతోనూ 45 నిమిషాల పాటు చర్చించా. ధర్మాన్ని నిలుపుకోకపోతే దేశానికి ఉనికి లేదు. ఈ దేశ ఉనికే ధర్మం. దాన్ని నిలబెట్టుకోవాలనేది మహత్తరమైన ఆలోచన అని గతంలో జరిగిన భేటీలో అమిత్‌ షా నాతో అన్నారు. తొమ్మిది రోజుల దీక్ష తీసుకొని విజయదశమి నాడు వస్తానని ఆయనతో చెప్పాను. పూర్తిగా ఆత్మపరిశీలన చేసుకున్నాకే  భాజపాలో చేరాను.మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందన్నారు. భాజపా సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. ఏదీ ఆశించి తాను భాజపాలో చేరడంలేదని స్పష్టంచేశారు.

మోదీ, అమిత్‌షా, రామ్‌మాధవ్‌ మార్గదర్శకత్వంలోనే పనిచేస్తాను.తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశంలో ఏమూలకు పంపినా చిత్త శుద్ధితో పనిచేస్తానన్నారు.ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి ఆయనేనని.. జూబ్లీహిల్స్ నుంచి పోటీ కూడా చేస్తున్నారని.. ఏపీకి చెందిన వారి ఓట్లు అక్కడ ఉండటం ఓ కారణమన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.అమిత్ షా, రామ్ మాధవ్‌లతో జరిపిన చర్చల సారాంశం ఇదేనంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.