పాక్ తో లింక్.. డీఎస్పీ దవిందర్ సింగ్ కు 15 రోజుల రిమాండ్

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులకు సహకరిస్తూ పట్టుబడ్డ డీఎస్పీ దవీందర్ సింగ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డీఎస్పీ దవిందర్ సింగ్ ను జమ్ములో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు దవీందర్ సింగ్ కు 15 రోజుల పాటు రిమాండ్ విధించింది. భారీ భద్రత మధ్య దవీందర్ సింగ్ తో పాటు ముగ్గురు ఉగ్రవాదులను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. దవీందర్ సింగ్ కు పాకిస్థాన్ తో ఉన్న లింక్ ల పై కూడా ఆరా తీస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. గతంలో దవీందర్ బంగ్లాదేశ్ కూడా వెళ్లినట్టుగా గుర్తించారు. బంగ్లాదేశ్ లో తన కూతుళ్లు చదువుకుంటున్నారని వివరణ ఇచ్చారు దవీందర్ సింగ్. 

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల లేటెస్ట్ కుట్ర తీవ్ర కలకలం రేపుతోంది. పోలీస్ ఉన్నతాధికారులు కూడా టెర్రరిస్టుల ట్రాప్ లో పడడం సంచలనం కలిగిస్తోంది. సౌత్ కాశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్ ను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదులను తన కార్లో ఢిల్లీకి తీసుకొస్తుండగా అరెస్టు చేశారు. నవీద్ బాబు, అల్తాఫ్ అనే ఉగ్రవాదులను ఢిల్లీకి తన కార్లో తీసుకొస్తుండగా పట్టుబడ్డాడు దవీందర్ సింగ్. షోపియాన్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. డీఐజీ అతుల్ గోయల్ స్వయంగా డీఎస్పీ దవీందర్ సింగ్ తో పాటు ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. 

గతంలో ఉగ్రవాద కార్యకలాపాలను అదుపు చేయడంలో ప్రతిభ కనపరచినందుకు డీఎస్పీ దవీందర్ సింగ్ శౌర్యపథకం కూడా లభించింది. ఇటువంటి ఆఫీసర్ ఉగ్రవాదుల ట్రాప్ లో చిక్కుకోవడం తీవ్ర సంచలనం రేపుతోంది. డీఎస్పీ కారు నుండి రెండు ఏకే 47 రైఫిళ్ల తో పాటు గ్రెనేడ్ లు కూడా స్వాధీనపరుచుకున్నారు. శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో దవీందర్ సింగ్ విధులు నిర్వహిస్తున్నారు.