ఆధార్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!!

 

సామాన్యుడి హక్కు అంటూ మొదలైన ఆధార్ కార్డుని.. తరువాత తరువాత అన్నింటికీ ఆధారే దిక్కు అనేంతలా మార్చేసింది ప్రభుత్వం. అయితే ఆధార్ వల్ల భద్రత లేదు, వ్యక్తిగత డేటాకి ముప్పని కొందరంటే.. అసలు అన్నింటికీ ఆధార్ అవసరమా? అంటూ మరికొందరు.. ఇలాంటి సమయంలో ఆధార్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆధార్‌తో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. ఆధార్ డేటా భద్రతపై అనుమానాలు అవసరంలేదనీ.. ఇది పూర్తి సురక్షితమని, విశిష్టమైనదని వ్యాఖ్యానించింది. ఆధార్‌ వల్ల వ్యక్తిగత గోప్యత, హ్యాకింగ్‌ జరుగుతున్నాయని ప్రధానంగా పిటిషన్‌దారులు వాదిస్తున్నారని, అయితే ఆధార్‌ డేటా హ్యాకింగ్‌ చేశారనే వార్తలు అవాస్తవమని ప్రభుత్వం స్పష్టంచేసిందని కోర్టు వెల్లడించింది. అయితే రాష్ట్రాలు సహా ప్రైవేట్‌ కంపెనీలు, మొబైల్‌ కంపెనీలు ఆధార్‌ డేటాను కోరడానికి వీల్లేదని కోర్టు స్పష్టంచేసింది. కోర్టు అనుమతి లేకుండా బయోమెట్రిక్‌ సమాచారాన్ని ఏ ఏజెన్సీలకు ఇవ్వడానికి వీల్లేదని తెలిపింది. అదేవిధంగా మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతాలకు ఆధార్‌‌ అనుసంధానం తప్పనిసరి కాదని పేర్కొంది. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ నంబర్‌లు తీసుకునేందుకు ఆధార్  కోసం బలవంతం చేయరాదని.. స్కూళ్లు, ప్రైవేట్ కంపెనీలు ఆధార్‌పై ఒత్తిడి చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. యూజీసీ, నీట్, సీబీఎస్‌ఈ పరీక్షలకు కూడా ఆధార్ గుర్తింపు సంఖ్య తప్పనిసరి కాదని పేర్కొంది. అయితే పాన్, ఐటీ రిటర్నులకు ఆధార్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు పేర్కొంది.