సాక్షి పేపర్ కి సుప్రీంకోర్ట్ అక్షింతలు

 

 

Supreme Court sakshi paper, sakshi Supreme Court, jagan sakshi paper

 

 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 'ప్రజా ప్రయోజనం' పేరిట వ్యాజ్యం వేసిన ఇద్దరు పిటిషనర్లకు చెరో రూ.50 వేలు జరిమానా విధించింది. జస్టిస్ రమణపై అవాస్తవాలు, విపరీతమైన వ్యతిరేకాలంకారాలతో కూడిన కథనం ప్రచురించిన 'సాక్షి' పత్రికని తీవ్రంగా తప్పు పట్టింది. ఆ కథనం పరువునష్టం, కోర్టు ధిక్కారం నేరాల కిందికి వస్తుందని పేర్కొంది.


సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైన తర్వాతే, జడ్జిపై ఉన్న క్రిమినల్ కేసు వివరాలను సేకరించి, దాని ఆధారంగా ఈ పిటిషన్ వేసినట్లు అర్థమవుతోందని తెలిపింది. "ఈ పిటిషన్‌ను చాలా నైపుణ్యంతో డ్రాఫ్ట్ చేశారు. జస్టిస్ రమణను చెడుకోణంలో చూపించేలా ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను మెలితిప్పారు. పిటిషనర్లు ఎంత సమర్థులో, న్యాయవాది ఎంత అనుభవజ్ఞుడో ఈ పిటిషన్‌ను డ్రాఫ్ట్ చేసిన విధానం చూస్తేనే అర్థమైపోతుంది'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.



ఈ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివేదికలోని అంశాలను తన తీర్పులో ప్రస్తావించింది. 'జస్టిస్ రమణపై ఉన్న కేసు రికార్డులను నిజాయితీతో, నిష్పాక్షికంగా పరిశీలించి ఉంటే... మేం ఈ తీర్పులో, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన నివేదికలో వ్యక్తం చేసిన అభిప్రాయాలే వారికీ కలిగేవి. ఈ పిటిషన్‌లో చిత్తశుద్ధి లేదు. ఏదైనా తప్పును సరిచేయాలనే నిజాయితీ లేదు. జస్టిస్ రమణను అపఖ్యాతి పాలు చేయడమే వారి అసలు ఉద్దేశం'' అని ధర్మాసనం స్పష్టం చేసింది. సీవీసీ కేసులో ఇచ్చిన తీర్పును ఈ కేసుకూ వర్తింప చేయాలన్న వాదనను తోసి పుచ్చింది.