జయలలితకు బెయిల్ ఇచ్చిన సుప్రీం కోర్టు

 

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ళ జైలు శిక్ష, 100 కోట్ల రూపాయల జరిమానాను ఎదుర్కొన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీం కోర్టు శుక్రవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. జయలలిత బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను కర్నాటక హైకోర్టు తిరస్కరించింది. అయితే ఆ తర్వాత జయలలిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు జయలలితకు బెయిల్ మంజూరు చేసింది. కర్నాటక హైకోర్టులో జయలలిత బెయిల్ పిటిషన్‌ మీద ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ వాదించారు. దాంతో ఆయన లాయర్‌గా విఫలం అయ్యారని భావించిన జయలలిత వేరే లాయర్‌ ద్వారా సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు జయలలితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తమిళనాడులోని ఆమె అభిమానులు, అన్నా డీఎంకే కార్యకర్తలు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంటున్నారు. గతనెల 27 నుంచి జయలలిత బెంగుళూరు జైల్లో వున్నారు. జయలలితతోపాటు ఆమె సన్నిహితులు శశికళ, ఇళవరసి, సుధాకరన్‌కి కూడా బెయిల్ లభించింది.