టీడీపీ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు.. సుప్రీంకోర్టు తీర్పు

 

అనంతపురం జిల్లాలోని మడకశిర నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక చెల్లదంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. రెండో స్థానంలో ఉన్న వైసీపీ అభ్యర్థి ఎం. తిప్పేస్వామే ఎమ్మెల్యేగా కొనసాగుతారని స్పష్టం చేసింది. 2014లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి పోటీ చేసిన ఈరన్న.. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి హైకోర్టును ఆశ్రయించారు. అఫిడవిట్‌లో ఈరన్న తన భార్య ప్రభుత్వ ఉద్యోగిని అనే విషయాన్నిపేర్కొనలేదని, అదేవిధంగా ఈరన్నపై కర్ణాటకలో రెండు కేసులు ఉన్నా.. వాటిని అఫిడవిట్‌లో పొందు పర్చకుండా ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించారని పిటిషన్ దాఖలు చేశారు. తిప్పేస్వామి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈరన్న ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈరన్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసు సుప్రీం కోర్టులో ఈరోజు విచారణకు వచ్చింది. హైకోర్టు తీర్పును పరిశీలించిన సుప్రీంకోర్టు.. ఈరన్న పిటిషన్‌ను కొట్టివేసింది. రెండోస్థానంలో నిలిచిన తిప్పేస్వామే ఎమ్మెల్యేగా కొనసాగుతారని స్పష్టం చేసింది.