మా నాన్నను చంపింది కరోనా కాదు: సున్నం రాజయ్య కుమారుడు

కొద్ది రోజల క్రితం భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత సున్నం రాజయ్య కరోనా బారిన పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం పై పార్టీలకు అతీతంగా నేతలు సంతాపం ప్రకటించారు. అయితే, తాజాగా ఆయన కుమారుడు విడుదల చేసిన ఓ ఆడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

 

ఉద్యమాలే ఊపిరిగా తన తండ్రి బతికారని... అందుకే తనకు సీతారామరాజు అని పేరు పెట్టారని అయన ఆ ఆడియో ద్వారా తెలిపారు. ఐతే కరోనా సోకిన తన తండ్రి పట్ల తమ గ్రామంలో కొంత మంది వివక్ష చూపారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. మొదటిగా మా ఇంట్లో మా అక్కకు కరోనా సోకిందని... దీంతో, తన తండ్రిని గ్రామస్తులు అదోలా చూడటం మొదలు పెట్టారని, ఆయన వస్తుంటే తలుపులు వేయడం చేశారని అయన తెలిపారు. దీంతో రాజయ్య మానసికంగా కృంగిపోయారని.. ఈ లోగా ఆయనకు కూడా కరోనా పాజిటివ్ అని తేలిందని అయన తెలిపారు. దీంతో తన తండ్రి విపరీతమైన ఆందోళనకు గురయ్యారని అయన తెలిపారు.

 

తన తండ్రి జీవితంలో ఎన్నో ప్రమాదాలను, రోగాలను చూసారని అటువంటి ఆయనకు కరోనా ఒక లెక్క కానే కాదని అయన చెప్పారు. ఏ ప్రజల కోసం తన తండ్రి పరితపించారో ఆ ప్రజలే ఆయనను దూరం పెట్టడాన్ని తట్టుకోలేకపోయారని అయన అన్నారు. అదే కనుక ప్రజలు పలకరిస్తూ, ధైర్యం చెప్పి ఉంటే తన తండ్రి బతికేవారని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా కరోనాపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించలేదని అయన విమర్శించారు.