లోక్‌సభ స్పీకర్‌గా మళ్ళీ మహిళ: సుమిత్రా మహాజన్

 

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎనిమిదో సారి ఎన్నికైన సుమిత్రా మహాజన్‌ను పదహారవ లోక్‌సభకు స్పీకర్‌గా ఎన్నుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో బుధవారం జరిగిన బిజెపి సీనియర్ నాయకుల సమావేశంలో నిర్ణయించారు. స్పీకర్ పదవికి సుమిత్రా మహాజన్ పేరును ప్రతిపాదించేందుకు వీలుగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం మధ్యాహ్నం సుమిత్రా మహాజన్‌ను కలిసి నామినేషన్ పత్రాలపై ఆమె సంతకాలు తీసుకున్నారు. స్పీకర్ పదవికి ఆమె నామినేషన్ పత్రాలను గురువారం దాఖలు చేస్తారు. ఆరో తేదీ సాయంత్రం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. లోక్‌సభలో ప్రతిపక్షం అనేదే లేకుండా పోవటంతో స్పీకర్ పదవికి సుమిత్రా మహాజన్ ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై బిజెపి నాయకులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.