భాజపా వల్ల ప్రజాస్వామ్యానికే ముప్పు

 

కడప స్టీల్ ప్లాంట్ గురించి తామిచ్చిన రిప్రజెంటేషన్‌పై కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేందర్‌సింగ్‌ ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు.ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ఏపీకి నష్టం కలగించేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించిన వివరాలను ఏపీ ప్రభుత్వం మెకాన్‌ సంస్థకు ఇవ్వలేదంటూ మంత్రి బీరేందర్‌సింగ్‌ ప్రకటించటం దారుణమని ఆయన మండిపడ్డారు.ఇప్పటికి ఏడు పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వం మెకాన్‌కు సమగ్ర సమాచారం ఇచ్చిందన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కావాలనే కేంద్రం ఆటంకాలు సృష్టిస్తూ కాలయాపన చేస్తోందన్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక కేంద్రం ఏపీ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులకు తామేమీ భయపడడం లేదని ఆయన స్పష్టం చేశారు. భాజపా చర్యల వల్ల ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లేలా ఉందని అన్నారు.

కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చేతిలో కూడా ఏమీలేదని,కడప స్టీల్ ప్లాంట్ పై కేంద్రప్రభుత్వం వెంటనే హామీ ఇవ్వాలని సుజనా చౌదరి డిమాండ్ చేశారు.ఎన్ని రోజుల్లో కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తారో కేంద్రం లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.3 మిలియన్ టన్నుల కెపాసిటీ ప్లాంట్ ఏర్పాటుకు సమాచారం ఇచ్చామని సుజనా చౌదరి అన్నారు.దీనిపై మరోసారి కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలుస్తామని సుజనా చౌదరి స్పష్టం చేశారు.