గ్యాస్ డబ్బులకి కక్కుర్తి పడిన కేంద్రం

 

 

ఇంతకాలం ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లను ఇస్తున్న కేంద్రం కొద్ది నెలలక్రితం ఆయిలు కంపెనీల ఒత్తిళ్ళకి లొంగిపోయి, ఒకేసారి 6సిలిండర్లు కోత విధించేసింది. అంతటితో ఊరుకోకుండా ఒక కుటుంబానికి కేవలం 6సిలిండర్లు బహు చక్కగా సరిపోతాయని సెలవిస్తూ, అంతకంటే ఎక్కువ అనవసరం అన్నట్లు మాట్లాడింది. ఆపైన ఒక్క సిలిండరు ఇచ్చినా ఆయిలు కంపెనీలకు వందల, వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుందని ఆయిలు కంపెనీల తరపున వఖల్తా పుచ్చుకొని మరీ మాట్లాడింది. అయితే, కేంద్ర నిర్ణయానికి యావత్ దేశ ప్రజలే కాక, తమ స్వంత పార్టీ వారు సైతం తీవ్ర అభ్యంతరం తెలపడంతో కాంగ్రెస్ పార్టీ సందిగ్ధంలో పడింది.

 

అంత భారాన్ని మోయలేనని చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ మొన్న గుజరాత్ ఎన్నికల సమయంలో వోట్లు దండుకోవడానికి సిలిండర్లు మళ్ళీ 9కి పెంచేందుకు సిద్ధం అయినప్పుడు, ఎన్నికల కమీషన్ కొరడా జళిపించడంతో వెనక్కి తగ్గింది. అంటే, తనకు లాభం వస్తుందంటే ఓట్ల కోసం ఎరగా వేసి, అది ఎంత భారమయినా భరించగలదని పరోక్షంగా తెలియజేసింది.

 

గత కొన్నిదశాబ్దాలుగా ప్రభుత్వం తరపున వడ్డింపు వార్తలే తప్ప చిన్న శుభవార్తకి కూడా నోచని భారత ప్రజలకి, ఎన్నికలు ముంచుకొస్తున్నపుడు మాత్రమే ఏచిన్న శుభావార్తయినా వినే అవకాశం కలుగుతుంటుంది. మళ్ళీ అదే కారణంవల్ల ఈ రోజు ప్రజలకి మరో శుభవార్త వినే అవకాశం కల్గింది. పెట్రోలియం శాఖామాత్యులు వాయిలార్ రవి ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రస్తుతం ఇస్తున్న 6 గ్యాస్ సిలిండర్లను 9కి పెంచబోతున్నట్లు డిల్లీలో నేడు ప్రకటించేరు. ఏప్రిల్ 1వ తేదీ నుండి అనే ప్రకటన వెనుక ఈ నాలుగు నెలలు కూడా ప్రజలనుండి ఎంత వీలయితే అంతా పిండుకొందామనే దురాశ కూడా కనిపిస్తోంది.

 

ధరలు పెంచేటప్పుడు అర్ధరాత్రి నుండే అమలు చేసే ప్రభుత్వం, ప్రజలకి మేలుచేసే నిర్ణయాలను మాత్రం అమలు చేయడానికి ఈ విధంగా మీనమేషాలు లెక్కపెట్టుకోవడం దాని నైజాన్ని తెలియజేస్తోంది.