రతన్‌ టాటా పై స్వామి సంచలన వ్యాఖ్యలు..

 

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి అన్ని వ్యవహారాల్లో నేనున్నానంటూ తలదూర్చే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు టాటా వివాదాల్లో కూడా ఆయన వేలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్‌టాటాపై సంచలన ఆరోపణలు చేశారు. టాటా గ్రూప్‌ చరిత్రలోనే రతన్‌ టాటా అత్యంత అవినీతిపరుడైన ఛైర్మన్‌ అని.. వాస్తవానికి రతన్‌ టాటా అసలు టాటా వారసుడు కాదని, ఆయన తండ్రే ఓ దత్తపుత్రుడని ఆరోపించారు. సైరస్‌ మిస్త్రీ వ్యవహారంలో రతన్‌ టాటా అన్యాయంగా వ్యవహరిస్తున్నారన్న స్వామి .. రెండు నెలల క్రితం మిస్త్రీ పనితీరును బోర్డు ప్రశంసించిందని అదే అతనిపై టాటా అసూయకు కారణమని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ కుంభకోణం, ఎయిర్‌ ఏసియా స్కామ్‌, విస్తారా భాగస్వామ్య వ్యవహారం వంటి అంశాల్లో టాటా ప్రమేయం ఉందని ఆరోపించారు. వీటినుంచి తప్పించుకోవడానికే ఆయన సైరస్‌ని తప్పించారని, కానీ ఒకసారి న్యాయవిచారణ మొదలైతే ఆయన తప్పించుకోలేరని స్వామి పేర్కొన్నారు. కాగా టాటా గ్రూపుల ఛైర్మన్ పదవి నుండి సైరస్ మిస్త్రీని తొలగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రతన్ టాటా తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించారు.