మాల వేస్తే స్కూలుకు రావద్దు.. అయ్యప్ప భక్తులపై క్రిస్టియన్ స్కూల్ ఆంక్షలు

 

భువనగిరి ఇండియన్ మిషన్ స్కూలు యాజమాన్యం పై అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ పై దాడి చేసి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. అయ్యప్ప మాల వేసుకున్న పిల్లలను క్లాసులకు రావద్దని చెప్పడంతో యాజమాన్యంపై స్వాములు మండి పడ్డారు. మాల వేసుకుంటే స్కూలుకు ఎందుకు రాకూడదని పాఠశాల ప్రిన్సిపల్ ను, టీచర్లను నిలదీశారు. ఇండియన్ మిషన్ స్కూల్ లో నాలుగో తరగతి చదువుతున్న ప్రణీత్ రెడ్డి తండ్రితో పాటు అయ్యప్ప మాల వేసుకున్నాడు. అయ్యప్ప మాల వేసుకున్నాడని ప్రణీత్ ను క్లాస్ లోకి రావద్దని పాఠశాల యాజమాన్యం ఇంటికి పంపించింది. అలానే నాలుగు ఐదు తరగతులు చదువుతున్న నలుగురు విద్యార్థులు మాల వేసుకున్నారు. రోజూ లానే స్కూలుకు వెళ్లిన ప్రణీత్ ను తిరిగి ఇంటికి పంపేసింది యాజమాన్యం. వెంటనే ప్రణీత్ తండ్రి వెళ్లి ప్రిన్సిపాల్ ని ప్రశ్నించగా.. మాలలో ఉన్న విద్యార్ధులను బడిలోకి అనుమతించకూడదని యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. వెంటనే అయ్యప్ప స్వాములకు శివారెడ్డి సమాచారమిచ్చారు. 

పెద్ద సంఖ్యలో బడి ప్రాంగణం దగ్గరకు చేరుకున్న అయ్యప్ప స్వాములు స్కూల్ ఎదుట ధర్నా చేశారు. తమ మత విశ్వాసాలకు భంగం కలిగిస్తున్న పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అక్కడే మూడు గంటల పాటు ఆందోళన నిర్వహించారు. స్కూల్ లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. అదే సమయంలో పలువురు తల్లితండ్రులు స్కూల్ కి వచ్చి పిల్లలను ఎందుకు వేధిస్తున్నారని టీచర్లను నిలదీశారు. పాఠశాల యాజమాన్యం అయ్యప్ప స్వాముల వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొనడంతో అక్కడికి పోలీసులొచ్చారు. విద్యాశాఖాధికారులు కూడా జోక్యం చేసుకోవటంతో పాఠశాల యాజమాన్యం దిగొచ్చింది. తాము ఏ మతానికి వ్యతిరేకంకాదని అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామని చెప్పి అయ్యప్ప స్వాములను క్షమాపణ కోరింది. మాల వేసుకున్న విద్యార్ధులను అనుమతిస్తామని పేర్కొంది. గతంలో వినాయక దీక్షను చేపట్టిన విద్యార్ధులను కూడా బడిలోకి యాజమాన్యం అనుమతించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి జరిగిన దానికి ప్రిన్సిపాల్ క్షమాపణలు చెప్పడంతో అయ్యప్ప స్వాములు శాంతించారు.