స్టార్ బ్యాట్ మ్యాన్ ని అవుట్ చేసే బౌలర్ ని దింపుతాము: వీ.హెచ్చ్.

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోర్ కమిటీ సమావేశంలో సమైక్యాంద్రకి మద్దతుగా మాట్లాడుతూ తెలంగాణా అభివృద్ధికి తగిన ప్యాకేజ్ ఇస్తే సరిపోతుందని వాదించారు. ఇది తెలంగాణా వాదులకు నేతలకు ఆగ్రహం కలిగించడం సహజమే. కానీ, ఆ వాదన చేసింది సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో ఎవరూ కూడా నోరెత్తే సాహసం చేయలేకపోయారు. మొన్న విజయవాడ యంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ సమైక్యరాష్ట్ర సాధనకోసం తమ స్టార్ బ్యాట్ మ్యాన్ ఇప్పటికే ఆడుతున్నాడని, అతను రాష్ట్ర విభజనను సమర్ధంగా అడ్డుకొంటాడని అనడం పుండు మీద కారం చెల్లినట్లయింది.

 

రాజ్యసభ సభ్యుడు వీ. హనుమంత రావు వెంటనే స్పందిస్తూ “ఆ స్టార్ బ్యాట్స్ మ్యాన్ ఎవరో చేపితే అతనికి సరిపోయే బౌలర్ ను మేము రంగంలోకి దింపి ఔటు చేయిస్తాము. ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని పలికే లగడపాటి వంటి వారు ఈవిధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం వివేకం అనిపించుకోదు. అదేవిధంగా ముఖ్యమంత్రి తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలని సలహా ఇవ్వడం కూడా సమజసం కాదు. అంతగా అయితే, మాకు తెలంగాణా ఇచ్చేసి ఆ ప్యాకేజీ ఏదో సీమంధ్ర రాష్ట్రానికే ఇప్పించుకోండి. మాకేమి అభ్యంతరం లేదు” అని అన్నారు.