"కార్గో ముందుకు - పాసింజర్లు వెనక్కి- విశాఖ ఎయిర్ పోర్టులో వింత పరిస్ధితి"

ఏపీలో కీలకమైన విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి దేశంలో పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన సర్వీసులను ప్రైవేటు విమానయాన సంస్ధలు రద్దు చేసుకునే అలోచనల్లో ఉండగా.. అనూహ్యంగా సరకు రవాణా మాత్రం జోరందుకోబోతోంది. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి చెన్నై, కోల్ కతాతో పాటు ఇతర ప్రాంతాలకు కార్గో విమానాలు నడుపుకునేందుకు రక్షణ శాఖ అనుమతివ్వడమే ఇందుకు కారణం. దీంతో ఈ నెల 25 నుంచి కార్గో సర్వీసులను నడిపేందుకు పలు విమానయాన సంస్ధలు సిద్ధమవుతున్నాయి.

విశాఖపట్నం విమానాశ్రయం చరిత్రలో త్వరలో మరో మైలురాయి నమోదు కానుంది. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి చెన్నై, కోల్ కతా తదితర ప్రాంతాలకు కార్గో విమానాలను నడుపుకునేందుకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో తొలిసారిగా ఇక్కడి నుంచి రవాణా విమానాలు నడిపించేందుకు ప్రైవేటు విమానయాన సంస్ధ స్పైస్ జెట్ ముందుకు వచ్చింది. వాస్తవానికి ఈ నెల 15 నుంచే తొలి కార్గో విమానం టేకాఫ్ కావాల్సి వున్నప్పటికీ, రక్షణ శాఖ నుంచి అనుమతులు రావడం ఆలస్యం కావడంతో సర్వీసులు నిలిచిపోయాయి.

అయితే స్పైస్ జెట్ కోరిన సమయాలను కార్గో సేవల నిమిత్తం కేటాయించే పరిస్థితి లేదని విశాఖ రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేయడంతో ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. కేంద్ర మంత్రులతో చర్చించారు. విశాఖ నుంచి కార్గో విమానాల అవసరాన్ని గుర్తించి అనుమతులివ్వాలని విన్నవించారు. విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా మారనుందని, ఈ సమయంలో సరకు రవాణాకు అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరడంతో కేంద్ర రక్షణ శాఖ సానుకూలంగా స్పందించింది. కాగా, ఈ నెల 25 నుంచి చెన్నై- వైజాగ్ - కోల్ కతా, చెన్నై - వైజాగ్ - సూరత్ రూట్లలో కార్గో విమానాలు నడుపుతామని స్పైస్ జెట్ వెల్లడించింది. ప్రస్తుతం రోజు విడిచి రోజు సర్వీసులు నడుస్తాయని, స్పైస్ జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

మరోవైపు కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం మారుతున్న తరుణంలో ప్రయాణికుల విమానాలను పలు ప్రైవేటు ఆపరేటర్లు రద్దు చేసుకోనున్నారనే వార్తలు నగర వాసులను కలవరపెట్టాయి. ఈ తరుణంలో కార్గో సర్వీసులకు రక్షణ శాఖ అనుమతివ్వడం, ప్రైవేటు ఆపరేటర్లు సిద్దం కావడం చూస్తుంటే తిరిగి విశాఖపట్నం విమానాశ్రయానికి కొత్త కళ రానున్నట్లు అర్ధమవుతోంది. మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా విశాఖకు కార్యనిర్వాహక రాజధానిని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గ కార్యాచరణలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో వ్యాపార వర్గాలతో పాటు అటు విశాఖ నగర వాసుల్లోనూ ఓ రకమైన అనిశ్చితి నెలకొంది. అప్పటికే ఆర్ధికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు సర్వీసులు పాసింజర్ విమానాలను రెగ్యులర్ గా నడిపేందుకు సుముఖంగా లేనట్లు కనిపించింది. కానీ తాజాగా విశాఖలో రాజధాని వల్ల రక్షణ పరంగా ఇబ్బందులు తప్పవన్న వార్తలను తూర్పు నావికాదళం అధికారులు కూడా కొట్టిపారేయడంతో విశాఖకు పునర్ వైభవం వస్తుందని భావిస్తున్నారు.