కూకట్ పల్లి బరిలో సూరీడు?

 

తెల్ల జుట్టు.. నల్లటి మీసాలతో వైఎస్ రాజశేఖరరెడ్డికి ఎప్పుడూ వెనకే ఉంటూ పాదయాత్ర సమయంలో ఒక్కసారిగా తెరమీదకు వచ్చిన వ్యక్తి సూరీడు. వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా ఓ పదవి సృష్టించి మరీ సూరీడిని అందులో కూర్చోబెట్టారు. వైఎస్ ఉన్నన్నాళ్లూ సూరీడికి రాజభోగాలే. అలాంటిది, హెలికాప్టర్ ప్రమాదం తర్వాత అసలు సూరీడు ఏమైపోయారో కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. అలాంటిది ఆ పేరు ఇప్పుడు మళ్లీ తెరమీదకు వస్తోంది. సూరీడుకు అసెంబ్లీ టిక్కెట్ ఇప్పించేందుకు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు చక్రం తిప్పుతున్నారు. కూకట్పల్లి కాంగ్రెస్ టిక్కెట్ సూరీడుకు ఇప్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ను సూరీడు కలిసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు, తెలంగాణా పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించడం వెనుక కూడా కేవీపీ హస్తం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. టీ-పీసీసీ అధ్యక్ష పదవికి ముందుగా జానారెడ్డి పేరు బలంగా వినిపించింది. అయితే ఆఖరి నిమిషంలో ఆయనకు మొండిచేయి చూపారు. ఊహించని విధంగా పొన్నాల తెరపైకి వచ్చారు. ఈ తతంగం వెనకాల కూడా కేవీపీ మంత్రాంగం ఉందని అంటున్నారు.