ఈ తెలివి అప్పుడేమైంది సోనియా?: వెంకయ్య

 

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు లేఖ పట్టుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన కారణంగా ఎంతో నష్టపోయిన సీమాంధ్రను ఆదుకోవాలని మంగళవారం నాడు సోనియాగాంధీ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. సోనియాగాంధీ సీమాంధ్రుల మీద ఇంత ప్రేమ ఒలకబోస్తూ ప్రధానికి లేఖ రాయడం పొట్టలో కత్తితో పొడిచిన తర్వాత తల నిమిరినట్టుగా వుందన్న అభిప్రాయాలు తెలుగు ప్రజల్లో వ్యక్తమయ్యాయి. సోనియాగాంధీ రాసిన సదరు లేఖ కాంగ్రెస్ నీచ రాజకీయాలలో భాగమేనన్న విమర్శలూ వినిపించాయి. సోనియాగాంధీ రాసిన లేఖ మీద భారతీయ జనతాపార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పందించారు. సోనియాగాంధీ తన లేఖలో సీమాంధ్రుల మీద కురిపించిన ప్రేమలో కొంత శాతమైనా తమ ప్రభుత్వం వున్నప్పుడు చూపించి వుంటే బాగుండేదని వెంకయ్య వ్యాఖ్యానించారు. సీమాంధ్రులను ఆదుకోవాలని సోనియా తన లేఖలో పేర్కొన్నారని, సీమాంధ్రులను ఆదుకోవాలన్న సోనియాగాంధీ తెలివి తమ పార్టీ అధికారంలో వున్నప్పుడు ఏమైందని సోనియాగాంధీని వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. సోనియా సీమాంధ్రులను ఆదుకోవాలని లేఖ రాశారు సంతోషం.. అయితే ఆమె లేఖ రాయకపోయినా తమ ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ అభివృద్ధికి చిత్తశుద్ధితో, రాజకీయాలు లేకుండా కృషి చేస్తుందని ఆయన చెప్పారు.