ఢిల్లీలో అల్లర్ల వెనుక బీజేపీ కుట్ర.. అమిత్ షా రాజీనామా చేయాలి!!

ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 20కి చేరింది. 189 మంది చికిత్స పొందుతున్నారని జీటీబీ ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీల్ కుమార్ గౌతమ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కొనసాగుతున్న హింసపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పందించారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఢిల్లీలో అల్లర్లు జరగడం చాలా బాధాకరమని అన్నారు. ఈ అల్లర్లకు బీజేపీనే కారణమని విమర్శించారు. ఢిల్లీలోని ఈ హింస వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. ఇటువంటి ఘటనలనే ఢిల్లీ ఎన్నికల సమయంలోనూ దేశం యావత్తూ చూసింది. ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా, వారిలో భయపూరిత వాతావరణం నెలకొనేలా బీజేపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు అని మండిపడ్డారు. అల్లర్లకు హోంమంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని సోనియా డిమాండ్ చేశారు. ముందస్తు ప్రణాళికతోనే అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. అల్లర్లు జరుగుతుంటే ఢిల్లీ సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సమస్యాత్మక ప్రాంతాలపై సీఎం కేజ్రీవాల్ దృష్టి పెట్టాలన్నారు. బాధితులకు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు సాయం చేయాలని సోనియా పిలుపునిచ్చారు.