లౌకికవాదాన్నికాపాడుకొనేందుకే కలిసారుట!

 

కాంగ్రెస్ పార్టీ తన ప్రధాన ప్రత్యర్ధి బీజేపీని రోజూ తిట్టిపోసే ముందు ఓం ప్రధమంగా అదొక మతతత్వపార్టీ అని మొదలుపెట్టి ఇతర అంశాలపై విమర్శలకు వెళుతుంది. లౌకికవాదానికి తామే పేటెంట్ హక్కులు తీసుకొన్నట్లు, బీజేపీకి మతాల పేరిట ప్రజల మధ్య చిచ్చుపెట్టడమే పని అన్నట్లు కాంగ్రెస్ వాదిస్తుంటుంది. కానీ, ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచే అవకాశంలేదని క్రమంగా బోధపడుతుండటంతో, వరదలో కొట్టుకుపోతున్న మనిషికి గడ్డి పోచ దొరికినా సంతోషించినట్లు కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపు కోసం ఉన్న అన్ని మార్గాలను ఆన్వేషిస్తోంది. ఆ ప్రయత్నంలోనే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా తమ లౌకికవాదం కాసేపు పక్కనబెట్టి మొన్న మంగళవారంనాడు ఢిల్లీ జుమామసీద్ షాహి హిమామ్ బుఖారీతో సమావేశమయ్యి దేశంలో ముస్లిం ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకే ఓట్లువేసేలా చేయమని అభ్యర్దించారు. అయితే ఆలోచించవలసిన పాయింటు ఏమిటంటే బుకారీ సాబ్ దేశంలో ముస్లిం ప్రజలందరికీ ప్రతినిధి కాదు. ఆయన కేవలం ఒక మత గురువు మాత్రమే.


గత అరవై ఏళ్లబట్టి దేశంలో అధికశాతం ముస్లిం ప్రజల దుర్బర దారిద్ర్యం అనుభవిస్తూనే ఉన్నారు. నాటి నుండి నేటి వరకు దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ వారిని కేవలం ఒక ఓటు బ్యాంకుగానే చూసింది తప్ప వారిని కనీసం మనుషులుగా కూడా చూడలేదు. అందుకే వారి పరిస్థితిలో ఇంతవరకు కూడా మార్పు రాలేదు. పైగా నానాటికీ ఇంకా దారిద్ర్యంలో కూరుకుపోతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు సోనియాగాంధీ స్వయంగా బుకారీ సాబ్ ని కలిసి వచ్చినందున వారందరూ ఇంతకాలం కాంగ్రెస్ చేసిన నిర్వాకాలన్నిటినీ మరిచిపోయి కాంగ్రెస్ పార్టీకే గుడ్డిగా తమ ఓట్లు గుద్దేస్తారని అనుకోవడం అత్యాసే అవుతుంది.


సోనియాగాంధీ ఒక మతగురువుని కలిసి ఆవిధంగా కోరడం ఏరకమయిన లౌకికవాదమో తెలియదు కానీ దేశంలో లౌకికవాదాన్ని అంటే దానికి మారు పేరయిన కాంగ్రెస్ పార్టీని మతతత్వ పార్టీ అయిన బీజేపీ నుండి, దానికి నాయకత్వం వహిస్తూ తన ముద్దుల యువరాజు రాజకీయ భవిష్యత్తుని మంట గలిపేద్దామని చూస్తున్న నరేంద్ర మోడీ నుండి రక్షించవలసిన ఆగత్యం గురించి ఆమె బుకారీ సాబ్ కి విన్నవించుకొన్నారు. దానిపై సహజంగానే బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. బుకారీ ద్వారా దేశంలో ముస్లిం ప్రజలందరి ఓట్లు రాబట్టుకొందామని ప్రయత్నించడం, అది కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అడగడం ఉల్లంఘన క్రిందకే వస్తుందని తీర్మానించేసిన బీజేపీ సోనియాగాంధీపై ఎన్నికల కమీషన్ కి నిన్న పిర్యాదు కూడా చేసింది. అటువంటి పిర్యాదు వస్తే పరిశీలిస్తామని కమీషనర్ సంపత్ ముందే చెప్పారు గనుక వెంటనే పిర్యాదు స్వీకరించి నేడో రేపో సోనియమ్మను సంజాయిషీ కోరుతూ నోటీసు పంపవచ్చును. అయితే సుప్రీం కోర్టు చేత మొట్టికాయలు వేయించుకొన్నపుడే అదరలేదు..బెదరలేదు, అందువల్ల ఎన్నికల కమీషన్ నోటీసులు చూసి కాంగ్రెస్ పార్టీ బెంబేలెత్తిపోదని ఖచ్చితంగా చెప్పవచ్చును.