తన్నుకున్న కొత్త.. పాత తమ్ముళ్లు

 

నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో పాతకాపులు, వలస నేతల మధ్య ఏకంగా దాడులే జరుగుతున్నాయి. కొత్తగా పార్టీలో చేరిన సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వర్గాలు బాహాబాహీ తలపడ్డాయి. నువ్వెంతంటే.. నువ్వెంతంటూ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నాయి. వలస నేతల రాకను ఆహ్వానిస్తున్నట్లు నేతలు కడుపులో కత్తులు పెట్టుకొని గాంభీర్యాన్ని ప్రదర్శించినా కార్యకర్తలు దీనిని జీర్ణించుకోలేకున్నారు. ఇందుకూరుపేట మండలం కొత్తూరుకు చెందిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి వర్గీయుడు కైలాసం ఆదిశేషారెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి సతీమణి కైలాసం సుప్రియ కొత్తూరు-2 ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఇదే స్థానానికి సోమిరెడ్డి వర్గీయుడైన మాజీ ఎంపీటీసీ సభ్యుడు మునగాల రంగారావు భార్య మునగాల సుజాత కూడా నామినేషన్ వేశారు. వీరిలో బీ ఫారం ఎవరికి ఇవ్వాలన్న విషయమై రెండు వర్గాల మధ్య గొడవ కాస్త ఎక్కువగానే జరిగింది. ఎన్నికల అధికారి వద్ద ఒకరికొకరు ఎదురు పడిన ఇరువర్గాలు ఒక్కసారిగా ఆగ్రహావేశాలతో రెచ్చిపోయారు. దూషణల పర్వానికి దిగారు. మీరెంత అంటే మీరెంత అంటూ దుర్భాషలాడుకున్నారు. మరింత రెచ్చిపోయిన ఇరువర్గాల వారు తోపులాటకు దిగి పిడిగుద్దులు గుద్దుకున్నారు. సై అంటే సై అంటూ సవాల్ విసురుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎస్సై నాగేశ్వరరావు పోలీసు బలగాలతో అక్కడి చేరుకున్నారు. సోమిరెడ్డి, ఆదాల వర్గాలను చెదరగొట్టారు. పరిస్థితి అదుపు తప్పితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పరిస్థితి అదుపులోకి వచ్చింది. చివరకు పాతకాపైన సోమిరెడ్డి వర్గీయుడు రంగారావును కాదని కాదని ఆదాల వర్గీయుడైన ఆదిశేషారెడ్డి వర్గానికే టీడీపీ బీఫాం ఇచ్చారు.