స్వర్గీయ శోభా నాగిరెడ్డికి ఓట్లు వేస్తే చెల్లుతాయిట

 

వైకాపా సీనియర్ నేత శోభా నాగిరెడ్డి కొద్ది రోజుల క్రితం కారు ప్రమాదంలో మరణించడంతో, ఆమె పోటీ చేస్తున్న ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎన్నికలు వాయిదా పాడుతాయని అందరూ భావించారు. కానీ వైకాపా ఎన్నికల సంఘం వద్ద తన పేరు రిజిస్టర్ చేయించుకొన్న ప్పటికీ దానికి ఇంకా గుర్తింపు ఇవ్వనందున, షెడ్యుల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని, ఈవీయంలలో ఆమె పేరు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఒకవేళ తొలగొంచలేని పక్షంలో ఆమెకు వేసే ఓట్లు చెల్లని ఓట్లుగా పరిగణిస్తామని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ బన్వర్ లాల్ ప్రకటించారు. నిజానికి ఎక్కడయినా ఇదే పద్ధతి అనుసరిస్తారు. కానీ మళ్ళీ ఆయన తాజాగా మరో విచిత్రమయిన ప్రకటన చేసారు. శోభ నాగిరెడ్డి చనిపోయినప్పటికీ, ఈవీయంలలో ఆమె పేరు తొలగించడం వీలుపడలేదు కనుక, ఒకవేళ ఆమె పోటీ చేస్తున్న వైకాపాకు కేటాయించిన ఫ్యాన్ గుర్తుకే అత్యధికంగా ఓట్లు వచ్చినట్లయితే, ఆళ్లగడ్డలో మళ్ళీ ఉపఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.

 

శోభా నాగిరెడ్డి హటాన్మరణంతో ఏమిచేయాలో పాలుపోనే స్థితిలో ఉన్న వైకాపా, తమకు అనుకూలంగా ఉన్న ఒక స్వతంత్ర అభ్యర్ధికి మద్దతు ఇద్దామని ఆలోచించింది. కానీ ఇప్పుడు ఎన్నికల కమీషన్ స్వయంగా ఉపేన్నికలకి మార్గం సుగమం చేసింది గనుక, ఆమె మరణంతో ప్రజల ఏర్పడిన సానుభూతిని తమ పార్టీకే అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నంలో ఆమెకే ఓటువేసేలా ప్రజలను ప్రోత్సహించవచ్చును. ఒకవేళ ఈ ఎన్నికలలో వైకాపాయే విజయం సాధించి అధికారంలోకి వచ్చినట్లయితే, అప్పుడు ఉపఎన్నికలలో నెగ్గడం పెద్ద సమస్య కాబోదు.