పోలీస్ లైన్స్‌లో 104 అస్థిపంజరాలు

 

అది లక్నోలోని పోలీస్ లైన్స్ ఆవరణ. ఆ ఆవరణలో పోలీసు అధికారుల నివాస గృహాలతోపాటు కొన్ని పోలీసు శాఖ కార్యాలయాలు, ఒక పోలీస్ స్టేషన్ కూడా వున్నాయి. ఈ ఆవరణలో ఎప్పటి నుంచో ఓ మూల వున్న పాడుబడిన గదికి తాళం వేసి వుంటోంది. ఆ గదిలో ఏముందా అనే సందేహం కొత్తగా ఆ ప్రాంతానికి సంబంధించి బాధ్యతలు తీసుకున్న అధికారికి సందేహం వచ్చింది. తుప్పుపట్టి వున్న ఆ రూమ్ తాళాన్ని పగులగొట్టి తలుపులు తీశారు. లోపల కనిపించిన వస్తువులను చూసి అందరి గుండెలు ఆగినంత పని అయింది. లోపలకు అడుగు పెట్టగానే కపాలాలు కాళ్ళకు తగిలి బంతుల్లా దొర్లుతున్నాయి. కాళ్ళకింద పడి ఎముకలు పటపట విరిగాయి. అక్కడి దృశ్యం చూసి అందరూ భయపడిపోయారు. తర్వాత గుండెలు దిటవు చేసుకుని లెక్కపెడితే లోపల ఒకటో రెండో కాదు.. పదో ఇరవయ్యో అంతకన్నా కాదు.. మొత్తం 104 మానవ అస్థిపంజరాలు వున్నాయి. అవన్నీ ప్లాస్టిక్ కవర్టలో ప్యాక్ చేసి వున్నాయి. దాంతో ఎప్పుడో వీళ్ళందర్నీ హత్యచేసి ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ప్యాక్ చేసి ఈ రూమ్‌లో పడేశారని అందరూ భావించారు. అయితే ఆ తర్వాత పోలీసు అధికారులు విచారణ జరిపితే ఆ మృతదేహాల వెనుక ఎలాంటి ‘హత్యలు’ లేవని తెలిసింది. గతంలో.. అంటే దశాబ్దాల క్రితం ఈ ఆవరణలోనే ఫోరెన్సిక్ ఇన్‌‌స్టిట్యూట్ వుండేదట. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో స్టూడెంట్స్‌కి శిక్షణ నిమిత్తం దగ్గర్లోవున్న ప్రభుత్వ ఆస్పత్రి నుంచి అనాథ శవాలను తీసుకుని వచ్చేవారట. అలా వినియోగించిన శవాలన్నిట్నీ ఆ తర్వాత ఆ గదిలో వేసేవారట. అదీ సంగతి. అయితే ఈ విషయంలో మాత్రం స్థానిక రాజకీయ నాయకులు మాత్రం సీరియస్ అవుతున్నారు. ఈ విషయం మీద న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.