సింగపూర్ ఉచితంగా రాజధానికి ప్రణాళిక ఇస్తోందా..ఎందుకు?

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడ దగ్గర నిర్మించబోతున్న రాజధాని నగరానికి సింగపూర్ మాస్టర్ ప్లాన్ తయరుచేసి ఇవ్వబోతోంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి చెందిన రెండు సంస్థలతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకొంది. అయితే ఏవో కొన్ని ప్రజా పాలన, సంక్షేమ సంస్థలను మినహాయిస్తే మిగిలిన ఏ ప్రభుత్వ సంస్థలయినా, ప్రైవేట్ సంస్థలయినా లాభార్జనకోసమే పనిచేస్తాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఇంత భారీ ప్రణాళికను సింగపూర్ సంస్థలు ఉచితంగా తయారుచేసి ఇస్తున్నాయని ఆర్ధిక మంత్రి యనమల రామకృస్ణుడు చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ కొన్ని పత్రికలలో ప్రభుత్వం సింగపూర్ సంస్థలకి చాలా భారీ మొత్తం కన్సల్టెన్సీ ఫీజుగా ముట్టజెప్పబోతున్నట్లు వార్తలు వచ్చేయి.

 

వాటిలో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, ఎదోవిధమయిన ప్రతిఫలం ఆశించకుండా ఏ సంస్థ ఉచితంగా సేవలు అందిస్తుందని నమ్మడం కష్టం. కనుక ప్రభుత్వమే ఈ మాస్టర్ ప్లాన్ కోసం సింగపూర్ తో ఏవిధంగా ఒప్పందం చేసుకొన్నదీ ప్రకటిస్తే వివాదాలకు ఆస్కారం లేకుండా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

ఆ మధ్యన ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికలో మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చినందుకు ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం, రాజధానిలో నిర్మితమయ్యే భవనాలలో కొన్ని అంతస్తులను సింగపూర్ సంస్థలకి ఇచ్చేందుకు ప్రతిపాదిస్తే, ఆవిధంగా చేయడం వలన ఇరువువురికీ మున్ముందు చాలా ఇబ్బందులు వస్తాయి గనుక తమకు రాజధానిలోనే వేరేగా కొన్ని భూములను కేటాయించాలని సింగపూర్ సంస్థలు కోరినట్లు ఒక వార్త ప్రచురితమయింది.

 

ఇటువంటి వార్తలు, పుకార్లు ప్రభుత్వానికి ఊహించని కొత్త సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. అంతేగాక ప్రతిపక్షాలకు కూడా ప్రభుత్వాన్ని విమర్శిచెందుకు అవకాశం కల్పించినట్లవుతుంది. కనుక ప్రభుత్వమే స్వయంగా ఈ అంశంపై విస్పష్టమయిన ప్రకటన చేస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.