బిగ్ షాక్.. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సీఎం బావమరిది

 

మధ్యప్రదేశ్‌లో నవంబరు 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారాల హోరు, వలసల జోరు ఊపందుకుంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలలోని నేతలు, కార్యకర్తలు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు గోడ దూకుతున్నారు. అయితే బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. తాజాగా స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ బావమరిది( చౌహన్‌ సతీమణి సాధన సోదరుడు) సంజయ్‌ సింగ్‌ మసాని కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. తన బావ శివరాజ్‌సింగ్‌ చౌహన్‌, బీజేపీపై పలు విమర్శలు చేశారు. ‘గత 13ఏళ్లుగా శివరాజ్‌సింగ్‌ అధికారంలో ఉన్నారు. ఇక ఇప్పుడు కమల్‌నాథ్ సమయం వచ్చింది. మధ్యప్రదేశ్‌కు కమల్‌నాథ్‌ కావాలి. చౌహన్ అవసరం లేదు. బీజేపీ వారసత్వ రాజకీయాలకే మొగ్గుచూపుతుంది. పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారిని నిర్లక్ష్యం చేసి నేతల బంధువులకు మాత్రమే టికెట్లు ఇస్తోంది’ అని ఆరోపణలు చేశారు. మరో ఆసక్తికర విషయమేంటంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్‌ తన బావ చౌహన్‌పైనే పోటీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. బుధ్నీ స్థానం నుంచే కాంగ్రెస్‌ సంజయ్‌ను బరిలోకి దించే అవకాశాలున్నాయి. మొత్తానికి మధ్యప్రదేశ్‌లో బీజేపీకి గట్టి షాక్ తగిలినట్లయింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.