పార్లమెంట్ లో మహిళా ఎంపీకి వార్నింగ్! 

posted on: Mar 23, 2021 8:41AM

మహారాష్ట్రలో ప్రకంపనలు స్పష్టిస్తున్న ముకేష్ అంబానీ కేసు సెగలు పార్లమెంట్ ను తాకాయి. అంబానీ కేసులో సమగ్ర దర్యాప్తు చేయాలని కోరిన మహిళా ఎంపీని శివసేన ఎంపీ బెదిరించారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అమరావతి ఎంపీ, నటి నవనీత్ కౌర్.. శివసేన ఎంపీ అరవింద్ సావంత్ పై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్‌లోనే తనను ఆయన బెదిరించారని ఆమె ఆరోపించారు. ‘‘మీరు మహారాష్ట్రలో ఎలా తిరుగుతారో నేనూ చూస్తా. మిమ్మల్ని కూడా జైలులో వేసేస్తాం.’’ అంటూ శివసేన ఎంపీ అరవింద్ బెదిరించారని ఎంపీ నవనీత్ కౌర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మన్సుఖ్ హిరేన్ హత్య, సచిన్ వాజే వ్యవహరంపై ఉద్ధవ్ సర్కార్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన బెదిరింపులకు దిగుతున్నారని నవనీత్ కౌర్ ఆరోపించారు. ‘‘ఈ రోజు శివసేన ఎంపీ నన్ను బెదిరించారు. ఈ అవమానం నాకే కాదు. మొత్తం మహిళా లోకానికే అవమానం. అందుకే వీలైనంత తొందరగా ఎంపీ అరవింద్ సావంత్‌ వ్యాఖ్యలపై పోలీస్ దర్యాప్తు చేయించాలి.’’ అని నవనీత్ కౌర్ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి కూడా నవనీత్ కౌర్ పంపించారు. 

అయితే నవనీత్ కౌర్ చేసిన ఆరోపణలపై శివసేన ఎంపీ అరవింద్ స్పందించారు. ‘‘ఆమెను నేనెందుకు భయపెడతాను? నేను బెదిరించే సమయంలో ఆమె చుట్టుపక్కల ఎవరైనా ఉంటే చెప్పండి. ఆమె వ్యవహార శైలి, స్పందించే విధానం ఏమాత్రం బాగోలేదు.’’ అని అరవింద్ తీవ్రంగా మండిపడ్డారు.  అంబానీ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తుండటంతో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఉద్దవ్ థాకరే సర్కార్ పై ఒత్తడి పెరుగుతోంది. మరోవైపు తన పార్టీకి చెందిన హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ను మరోసారి వెనకేసుకొచ్చారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. 

google-ad-img
    Related Sigment News
    • Loading...